పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

ద్విపద భారతము

పరికించి యతనిచాపముఁ ద్రుంచి వైన
సురుతరక్రోధియై యుగ్రాంశుకొడుకు
మింట మంటలు వాఱ మెఱు గారుశక్తిఁ
గంటగించుచుఁ గేలఁ గడుబల్మిఁ బట్టి
గట్టిగా ధృతి దోఁపఁ గౌంతేయుమీఁద
నెట్టన వైచె నిర్ణిద్రదర్పమున,
ఆశక్తిఁ జూచి భయాసక్తి నడలి
వాసవాదులు చూడ వాసవాత్మజుఁడు
పదిలుఁ డై బహుబాణపటలంబు దొడిగి
యది నూఱుఖండంబులై రాల నేసె.
నుతశక్తి నంతఁ గర్ణునిమూలబలము
పతికి నడ్డము వచ్చి పార్థుపై నపుడు
భద్రదంతావళప్రతతి డీకొల్పి
రౌద్రముద్రోన్నిద్రరసికభావమున
బలుతూపు లేసి యార్భటము చేయుటయుఁ
బ్రళయకాలాంతకప్రతిముఁ డై యతఁడు
దంత కాండంబులు తరుమండలములు
సంతతమదధార చారునిర్ఝరము
ఘనగండయుగళముల్ గండశైలములు
కొనముక్కు చమరులు గుహలుగాఁ గలిగి