పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

223

అని చెప్ప మఱియుఁ గృపాచార్యు భీష్ముఁ
గనుఁగొని పలికె నక్కలశసంభవుఁడు
"ఇన్ని యుత్పాతంబు లీసేనఁ బుట్టెఁ
జెన్నారఁ గ్రీడికి సిద్ధించు జయము.
విలుకాఁడు గాండీవి, విల్లు గాండివము
తలపోయ నతఁడు యుద్ధము గెల్చు టరుదె?
సేనకు నృపునకు సేమంబు గలుగ
నే నొక్క చందంబు నేర్పఱించెదను.
భూతలాధీశుఁడు మున్నాడి పోవ
నాతనివెంట నొయ్యనఁ బోవుఁ బసులు.
ఈవల మనయోధు లెల్లఁ గల్లఁగను
ఆవచ్చు క్రీడికి నందవు పసులు."
అనవుడు విని కౌరవాధీశ్వరుండు
తనమహారధుల నిందఱఁ జూచి పలికె
"ఓహో విచారింప కూరక మీరు
ఆహవంబునకు నఱ్ఱాడు చున్నారు.
ఆడికఁ బడి జూద మాడి కౌంతేయు
లోడిననాఁడు తా ముగ్రాటవులను
జరియించి పండ్రెండు సంవత్సరములు
నొరు లెఱుంగక యుండ కొకయేఁడు గడప