పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

222

ద్విపద భారతము.

అనిన వాసవపుత్త్రుఁ డా యుత్తరునకు
మనసులోపలిభీతి మాన్పంగ వలసి
చిందంబు మ్రోఁతయు శింజినీరవము
నందంద పరఁగించి యలవాటు చేసె.
అరదంబు వీ తెంచు నారనంబు విని
గురుఁ డుద్దవిడిఁ బల్కెఁ గురునాధుతోడ :

వచ్చెడువాఁ డర్జునుఁ డని ద్రోణుఁడు దుర్యోధనునకుఁ దెలుపుట.



"ఇంక సందియ మేల? యింద్రనందనుఁడు
శంకింప కిటు వచ్చె సమరంబు గోరి;
అదె వచ్చె దేవదత్తాభీలరవము.
అదె తోఁచె గాండీవజ్యానినాదములు.
అదె చూడు దేవేంద్రుఁ డతనిలావునకు
మది మెచ్చి యిచ్చిన మణికిరీటంబు.
అదె చూడు భూతంబు లతి ఘోరభంగిఁ
గదిసి కొల్వఁగ నొప్పెఁ గపికేతనంబు.
కా కున్న నింతభీకరవృత్తి మనకుఁ
జేకొని తోఁచునే చేష్టితంబుగను ?
ఇతనితో మార్కొన నిర వైన తెఱఁగు
చతురతఁ గావింపు జననాధ నీవు”