పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-4

209

అతఁ డంత నేనూఱు లబ్దంబు లైన
హితబుద్ధి వరుణున కిచ్చె నావిల్లు,
అతఁడు నూఱేండ్లకు నగ్ని కొప్పించె ;
అతఁడుఁ గిరీటికి నది తెచ్చి యిచ్చె.
అరయఁ గ్రీడియు నిది యరువదేనేండ్లు
ధరియింపఁ గలవాఁడు ధాత్రీశతనయ.
కావున నిది దివ్య కల్పితం; బింక
భావింప నితరచాపము లెల్ల వినుము.
వెలయంగ నెంతయు వృషభ లాంఛనము
గలవిల్లు పాండవాగ్రజుఁ డొప్పఁ దాల్చు.
ఘనతాళమితియుఁ గర్కటలాంఛనంబు
నొనరినవిల్లు వాయుజుఁ డొప్పఁ దాల్చు.
అనలవర్ణంబు మీనాంకంబుఁ గలుగు
ధను వది నకులు సాధనము యుద్ధమున.
పసుపువర్ణంబును బర్హి లాంఛనము
నెసఁగునాసహదేవుఁ డిలఁ దాల్చువింట.
చదలఁ గొమ్మెఱుఁగులు చల్లు చుండునది
గదఁ జూడు భీముసంగ్రామసాధనము."
అని చెప్పి మఱియుఁ గాండాదివర్ణనము
లను వొప్పఁ జెప్ప నిట్లనియె నుత్తరుఁడు: