పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

208

ద్విపద భారతము.

ఎవ్వ రివ్వారిలో నీవిల్లు దాల్తు
రెవ్వ రెవ్వరు దాల్తు రివి యెల్ల?" ననిన
దివిజేంద్రసుతుఁడు దాఁ దివిరి యాతనికి
వివరింపఁ దొడఁగె నావృత్తాంత మెల్ల:

అర్జునుఁ డుత్తరునకు నాయుధముల వేర్వేఱ వర్ణించి తెలుపుట.


"తొలుత నీ వడిగినతోరంపు విల్లు
వెలయ గాండివనామవిఖ్యాతి నొప్పు,
తఱమి గీర్వాణగంధర్వరాక్షసుల
నెఱయ సాధించె దానిం బూని నరుఁడు.
ఇది యుద్ధ సాధన మిది సర్వరక్ష
యిదియేడుగడయు నాయింద్రనందనున
కోవింటఁ దొడిగినయిషుపరంపరల
కావల గిరు లైన నడ్డంబు గావు.
నుతశక్తి నిది బ్రహ్మ నూఱువే లేండ్లు
చతురుఁ డై తాల్చి ప్రజాపతి కిచ్చె
నలి నాతఁ డరువదినాల్గువే లేండ్లు
విలసితగతిఁ దాల్చి వృత్రారి కిచ్చె.
ఎలమి వృత్రారియు నినుబది యేండ్లు
కలయంగ నది తాల్చి కమలారి కిచ్చె'