పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

192

ద్విపద భారతము.

నాదరం బొప్ప ని ట్లను “నీవు నాకు
నాదట సూతకృత్యము సేయ వలయు.
ఆరీతిఁ జేయఁ బొ మ్మన రాదు నీకు.
సైరంధ్రి చెప్పి నీసామర్థ్య మెల్ల.
కౌరవులకు నాకుఁ గయ్యంబు గలిగె;
వారక ధరియింపు వజ్రాంగిజోడు"
అనినయుత్తరుతోడ నాక్రీడి పలికె :
"చను నయ్య ననుఁ బిల్వ సారథ్యమునకు
నాటపాటలఁ బిల్వ నర్హంబుగాని ?
పోటులాటకు నాకుఁ బొసఁగునే యకట !
చారుదోర్బలశౌర్యసంపన్నుఁ డొకఁడు
తేరు దోలినఁ గాని తీఱునే పనులు?"
అనుటయు నరు నిట్టు లనియె నుత్తరుఁడు
“విను బృహన్నల నీవు వేడ్కతోఁ దొల్లి
అరదంబు దోలినయాశక్తిఁ గాదె
నరుఁడు ఖాండవదహనం బొప్పఁ జేసె
నాటిదోర్బలమును నాటిసాహసము
నాటినేర్పును జూపి నా మెప్పు గాంచ
కొప్పనియ ట్లింక నొకటిపై నొకటి
చెప్పు చుండిన నాదుచిత్తంబు నొచ్చు"