పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -1

రాయిడి పుట్టించి రారాజు మరల
కీయవస్థలు దెచ్చు టెఱుఁగరే మీరు ?
వాఁ డింక నజ్ఞతవాసంబువలన
బోఁడిగా మము రోయఁ బుత్తెంచు జనుల;
మీరు మే మొకచోట మెలఁగంగ రాదు
మీ రింక మముఁ బాసి మీత్రోవఁ. జనుఁడు.
ఏకాలమును మిమ్ము నెడసి పోనీక
చేకూరఁ బరిచర్య సేయ లే దయ్యె.
ఎడపక ధాత్రిలో నెట్టివారలును
బడనియాపద మాకుఁ బ్రాప్త మై వచ్చె
నెన్నఁడొకో మాకు నింక మీలోనఁ
బన్ను గా విహరించు భాగ్యంబు గలుగు!
నని దైన్యపాటుతో సందఱఁ బల్క-
జననాయకునిఁ జూచి సకలబ్రాహ్మణులు
"మీ కేల శోకింప? మీరు సాహసులు;
చేకొని రాజ్యంబు సేయ నున్నారు.
ఆపద పడువార, లకట మీ రేల,
ఏపార వేల్పులు నెందఱేఁ గలరు.
పాయక నిషధాద్రిఁ బ్రచ్ఛన్న వృత్తి
వేయికన్నులవేల్పు విహారించె మున్ను .