పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

145

అని యర్జునుఁడు పేడి యై యున్న తనకు
ఘనవైరిశిక్ష యోగ్యము గామిఁ దెలుప
విని సవ్యసాచికి వెలఁది యిట్లనియె:
"నిను దూఱ వచ్చునే నీవు మాన్యుఁడవు
పృథివి నీరూపంబు బీభత్స మైనఁ
బృథివీశునకుఁ జాలఁ బ్రియ మయ్యె నేఁడు.
నరుఁడవు కావున నాదుఃఖసమితి
పొరసిన నొకవేళఁ బొరసెఁ గా కేమి ! "
అని చెప్పి వెనువెంట నచటికన్నియలు
చనుదేరఁగా దేవిసదనంబుఁ జొచ్చి
కడఁగినతనయుబ్బు గాన రా నీక
పొడమినచిఱునవ్వు పొడమంగ నీక
వెడలఁ జూచినమాట వెడలంగ నీక
యడరక తొడరక యపుడు పాంచాలి
యలరినసంతోష మనుగుఱ్ఱమునకు
నలధైర్యమే కళ్లియంబుగాఁ బట్టి
దేవిముందఱ వచ్చి తెఱఁ గొప్ప నిలువ
దేవియు భయశోకదీనభావమున
మడుఁగులు దెప్పించి మణులు దెప్పించి
తొడవులు దెప్పించి ద్రుపదనందనకుఁ