పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము___ఆ-౩.

143

ఘనదయాపరునకు గంధర్వునకును
అనయంబుఁ బ్రణమిల్లి యర్థి మోదింతు".
అనిన భీముఁడు గూఢ మైనవాక్యముల
ననజలోచనఁ జూచి వల నొప్పఁ బలికె
"చపలనేత్రకు నొక్కసంటం బైన
నపుడు తాఁ దఱి వేచి యచట సంధించి
మగఁటిమిఁ జూపనిమగఁ డేటిమగఁడు ?
జగతి వానికి నేల సత్కీర్తి గలుగు?"
అనుటయు వినుచు నాట్యాలయమునకుఁ
జని యర్జునునిఁ జూచి సతి సంభ్రమించె.
నృత్తంబు సాలించి నెమ్మిఁ గన్నియలు
మొత్త మై చనుదెంచి ముదిత కిట్లనిరి:
"చపలాక్షి కీచకుఁ జంపించితమ్మ !
ఉపకీచకులఁ బట్టి యొప్పించితమ్మ !
వారిచేఁ బడియు నొవ్వక వచ్చితమ్మ !
వైరిదర్సఘ్ను లౌబలులు నీమగలు!
అమ్మ నీ కెవ్వరు నపకార మింక
నెమ్మిఁ జేయఁగ లేరు నిఖిలలోకముల"