పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

137

"జగతీశ విననయ్య సైరంధ్రి నేఁడు
మగలచేఁ జంపించె మనసింహబలుని.
వడిఁ గీచకునితోడ వామాక్షిఁ గాల్పఁ
గడఁగి నీయనుమతిఁ గాంచ వచ్చితిమి
పనివడి యటు చేయ పగ లాఱు మాకు"
అనవుడు విరటుండు నపుడు కీచకులు
తనమాట విన రని తాను భావించి
యను వార నిట్లనె నలవారితోడ
"మీకుఁ దోఁచినయట్లు మీరు వర్తింపుఁ
డాకులపడి నన్ను నడుగ నేమిటికి ?
తలకొని మీయన్న తనివిధిఁ బోయె
వల దన మా వెడివారలే మీరు?"
అనుటయు ననుమతం బదియకాఁ దలఁచి
జననాధు వీడ్కొని చని దురాత్మకులు
"ఆలోకమున నైన నతనితోఁ గూడు
నాలోలనేత్రఁ దెం” డని పట్టి తెచ్చి
పనిగొని శవముతోఁ బాంచాలిఁ గట్టి
కొనిపోవుచును బంధుకోట్లును దారుఁ
బెరిఁ గెడి శోకాగ్నిఁ బితృవనంబునకుఁ
గరదీపికలు పట్టి కదలి రందఱును.