పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము

135

అనవుడు వారు హాహారావ మెసఁగఁ
జని వానిచావుఁ గీచకులకుఁ దెల్ప
దివ్వెకోలలవారు తివిరి కీచకులు
రవ్వతోఁ బాఱి నర్తకశాలఁ జొచ్చి
పరువిడి సూతుపైఁ బడి యేడ్చు వారు
పరులకు లోఁగనివాని శౌర్యమును
నెలకొన్న చింత వర్ణించి వర్ణించి
పలవించువారు నై వగఁ జెంది తూల
వారిబాంధవు లంత వచ్చి కీచకునిఁ
జేరి వీక్షించి యచ్చెరు వంది యపుడు
"విసుమానములు గాక విననిట్టిచావు
పొసఁగ ధాత్రి నెవారు పొడగన్న వారు !
ఎయ్యది పాదము లెయ్యది కరము
లెయ్యది మస్తకం బీకీచకు నకు !
చెలఁగి గంధర్వులచేఁ జచ్చు వారి
కలయంగ నిదియె మర్యాద కాఁబోలు !
తగునయ్య కీచక ధర్మంబు విడిచి
మగువకు నై పోయి మరణంబు నొంద ?
అడవికిఁ గాసినయట్టి వెన్నెలకు
నడరంగ సరి యయ్యె సయ్య నీలావు ?