పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాట పర్వము--ఆ-2

131

వనిత నీ కింక నెవ్వం డెగ్గు దలఁచు
నని మొనఁ దెగటార్తు నతని నిభ్భంగి."
అనవుడుఁ బులకించి యతివ లజ్జించి
యనిలసంభవుఁ జూచి యను వొప్పఁ బలికె.
"ఏమానవుఁడు చేసె నిట్టిసాహసము ?
ఏ మని వర్ణింతు నేను నీశక్తి ?
అల వొప్ప ధర్మజుఁ డడ్డపెట్టుటయుఁ
గొలువులోపల నీవు కోపంబు మాని
యీనాట్యశాలలో నీమధ్యరాత్రి
వీనితో మార్కొని వెఱ పింత లేక
తోడఁబుట్టువు లున్నఁ దో డాసపడక
చూడంగ మిక్కిలిశూరత మెఱసి
ప్రజలు గానక యుండఁ బవమానతనయ
నిజముగా భుజశక్తి నెగడంగఁ జేసి
తగు నింక దుర్యోధనాదులఁ జంపి
పగఁ దీర్ప నోపుదు బాహు గర్వమున"
అని యింతి కొనియాడ ననిలసంభవుఁడు
ఘనతరసంతోషకలితుఁ డై పలికె
“వచ్చినపని యయ్యె వనిత నీ వింక
నిచ్చోట వర్తింప నేమి కారణము ?