పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

115


అనుమాన మేటి కే నందు వచ్చెదను.
చనుము సీయింటికి జవ మొప్ప" ననిన
నానాతిమాటల కొత్మలో నలరి
"యే నొక్కఁడన వత్తు నీరాత్రి నటకు,”
అని యాతఁడనఁ గాంత "యది నీవు మఱవఁ
జనదు, నీ వొంటిమై జనుదేర వలయు;
అటు గానియెడ నమ్ము మట నిల్వ లేను
తటుకున నేఁ బోవుదాన నా త్రోవ”
అన నెంతయును బొంగి యానీచుఁ డొప్పి
చనియె నింటికి నాత్మ సంచలింపఁగను.
చతురత, గార్యంబు సవరించి యిట్లు
సతి తనపను లెల్ల జరుపంగ నరిగె .
అట్టిద కాదె కమాంధుఁ డే పనుల
ముట్టినచో నెల్ల మోసపో కున్నె !
వాఁ డట్లు పోయిన వడి నెల్లపనులు
పోఁడిగాఁ దీర్చి యప్పువ్వారుఁబోఁడి
వండెడుగృహములో వాయుసంభూతుఁ
డుండఁగా సచ్చోటి కొప్పారఁ బోయి
తెలిసిన నెమ్మోము దీప్తిఁ జెన్నొందఁ
బలికి నల్లన నవ్వి బక వైరితోడ