పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

ద్విపద భారతము


తనవచ్చురాకకు ద్రౌపదీ దేవి
కనియుఁ గానని రీతిఁ గైకొన్న నెఱిఁగి
పలుక నేరక యున్నఁ బని లేనిమాటఁ
దలకొని ధరణిపైఁ దాటించుఁ గాలు,
వడిఁ బేర్చి కంబంబు వాయించుఁ గేల,
వెడపాటఁ బాడు, నవ్వెలఁదికట్టెదురఁ
బొడసూపు, సతి చూపుఁ బొడకాన కులుకు,
కడ లేనిమోహవికారంబు గ్రమ్మ
దొరకొని వాఁ డిట్లు దుర్విలాపములు
నెరయంగఁ జేసి యా నెలత కిట్లనియె:
"నెలఁత భాగ్యము గాదె నీపాదయుగముఁ
గొలిచి యుండుట నాకుఁ గొమరు దీపింప !
ఇది యేమి సైరంధ్రి యే నెంత యైనఁ
గదిసి ప్రార్థించినఁ గైకొన విపుడు :
వనజాక్షి నన్ను నెవ్వరిఁగాఁ దలంతు
వినుఁడును బో నోడు 'నే నిల్వు మనిన.
విరటుని నేఁ దెచ్చి విభునిఁగాఁ జేసి
చిరకాలమును గూడుఁ జీరఁ బెట్టుదును.
ధనముఁ బ్రాణమ్మును దరుణి నీ సొమ్ము;
నను పెవెట్టి గొన రాదె నా వేడ్కఁ జేసి?