పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

96

ద్విపదభారతము.

ఈనాతిఁ దా నుండి యింత సేయింపఁ
గానోపు నని దేవిఁ గనలెడివారు.
ప్రజ లిట్లు పలువురు పలుమాట లాడ
నిజనతిపై నల్క నెరపి ధర్మజఁడు
తొడరి మోమునఁ గిన్క దొడరంగనీక
మడవి యి ట్లని పల్కె మధ్యస్థుపగిదిః
“వినిరి నీమాటలు వెఱ నెల్లవారు,
చన రాదె యిఁక నైన సభలోనఁ దొలఁగి.
గంధర్వులకు వేళ గా కుండెఁ గాక
సంధింప కున్నా రె సాధ్వి నీపనికి.
నెలకొన్న సమయంబు నీకు వారలకుఁ
గలుగ కుండిన వచ్చి కాపరే నిన్ను?
నారి నాడుట గాదు పడి నేగు” మనిన
సైరంధ్రి మఱియు నచ్చట నిల్చి పలుకఁ
బూఁచినఁ గని ధర్మపుత్రుఁ డాసతికిఁ
దోఁచినకోపంబు దొడర ని ట్లనియెః
"నావ యించుక లేక నర్తించుపగిదిఁ
బూని యీపోకలఁ బోవ నేమిటికి ?
కులకాంత లీరీతిఁ గొలువులో నిలిచి
పలుకరు నీ వేల పలికెదో కాని.