పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

93


నుఱక చింతించెఁ బయోరాశి గలంచి
మెఱసి చిక్కనిరొంపి మెయిఁ బూసికొనఁగ.
ఉంకించెఁ గులగిరు లొండొంటిఁ దన్ని
కొంకక తాడించి గుదిఁ గ్రుచ్చి యాడ.
మిక్కిలి తమకించె మెలపుమై దిక్కు
లొక్కదిక్కును దెచ్చి యురుశక్తిఁ బొదువ.
ఊహించెఁ గీచకు నొగిఁ బుత్రమిత్ర
సాహాయ్యసహితంబు చంపి చెండాడ.
తగ నిట్లు కోపించి తనభుజంబులకు
దగినకైదువు లేమిఁ దల యూఁచి వగచి
ఘనమైనయొకమ్రాను గని యంతలోనఁ
దనర నించుక ధర్మతనయుఁ జూచుటయు
నతఁడును గనుసన్న సనుజు వారించి
చతురుఁ డై వలను విచారించి పలికె:
"వలలు, వేఱొక చోట వంటకట్టియలు
కలుగవే, యామ్రాను ఖండింప నేల?
ఇందఱు జూడఁగ నీది గూల్ప నేల ?
ఇందఱు నీలావు నెఱుఁగరే మున్ను ?
విఱువకు, మిప్పుడు వృక్షంబు మనకుఁ
దఱ చైనతలప్రాపు దాపునై యుండు"