పుట:ద్విపద భారతము విరాట పర్వము.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విరాటపర్వము - ఆ -2

87


"గనకపాత్రికఁ దెమ్ము కర్మ బంధముల
ననుభవింపక పోదు హరి కైన " ననుచు
గీచకమన్మధాగ్నియుఁ బోనిపాత్ర
మాచంద్రముఖి యీయ నంది యెంతయును
ఇచ్చఁ గుందుచు వానియింటికై యింతి
వచ్చుచుఁ డనపాటు భావించి పొగిలి,
"హా మాయవిధి యెట్టి యాపద దెచ్చె !
నామీఁదిదయఁ బాసె నారాయణుండు,
ఇక నాకు దిక్కెవ్వ రీవేళయందు !
ఇక నెట్లు, వీనిపో రేఁ బాయ" సంచుఁ
దలఁచి మోమున వెల్లఁదన మిమ్మడింప,
నులుకుచేఁ దనువల్లి యురుకంప మొందఁ,
దొడరుభీతిని నడఁ దొట్రుపా టొదవ,
నెడరుచే నిట్టూర్పు లెసఁగంగఁ, జెమట
నొడ లెల్లఁ దడియంగ నుప్పరంబునను
గడువేడ్క గ్రాలునక్కంజాప్తుఁ జూచి
" కర్మసాక్షివి నీవు కమల బాంధవుఁడ,
ధర్మంబు గెలిపించి దయసేయు మన్న ,
కీచకుఁ డొనరించుకీడు దప్పించు,
నీచేయుపురుషార్థ నిచయంబు చాలు."