పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కావున నేఁడే యందఱకు సమ్మతములైన శాస్త్రీయపదములు గూడినఁ గాని గ్రంథములు వ్రాయమనుటగాని, వ్రాయవద్దనుటగాని వెఱ్ఱితనము. కావున శాస్త్రమునందును, భాషయందును నభిమానముగలవారు నిర్భయ ముగఁ దమచేతనైనంతవఱకు శాస్త్రీయగ్రంథముల నిర్మించి యితర గ్రంథ కర్తలకును, నూతనముగాఁ బుట్టుచున్న పుట్టనున్న భాషా విషయక పరి షత్తులకును మార్గదర్శకులగుదురుగాక ! యని నమ్ముచున్నాను.

పారిభాషికపదములను గుఱించి యింకొక చిన్న సంగతి చెప్పవలసి యున్నది. హిందూ దేశమునందుఁ బ్రస్తుతము శాస్త్రీయపదములను సృజించుటకునై మహాప్రయత్నములు చేయుచున్నవారు కాశీలోని నాగరీప్రచారిణిసభ వారు; రెండవ వారు ట్వంటియత్ సెంచురీ డిక్ష్నరీ సంపాదకులును. మొదటిదానిలో ప్రొఫెసరు రే, ప్రొఫెసరు బోస్, ప్రి. సీల్ వంటి ఆంగ్ల, సంస్కృత భాష లయందును, బాశ్చాత్య శాస్త్రములయందును, మహామహోపాధ్యాయు లనిపించుకొను వారు కలరు. ట్వంటియత్ సెంచురీ డిక్ష్నరీలో ప్రొ. గజ్జర్, డాక్టర్ సర్ బాలచంద్ర వంటివారును గలరు. కావున మనభాషలో నూతనముగా శాస్త్ర వాఙ్మమయమును బుట్టింప నెంచిన "వారు తప్పక యీ రెండుగ్రంథములఁ జూడనగును.

ఇంక నొకపూర్వపక మున్నది. కొందఱు నూతనపదములను మనము సృష్టింప నక్కఱలేనేలేదు ; ఇంగ్లీషుపదములనే గ్రహించుట మంచిదని వాదించెదరు. కాని దీనికి నేను వేఱుగ జవాబు చెప్పనక్కఱ లేదు. జర్మనీ వారే చెప్పఁగలరు. యూరోప్ ఖండమునం దిప్పడు నిర్మింప బడుచున్న శాస్త్రీయపదములు గ్రీకు, ల్యాటిన్ భాషాభూయిష్టమై మూరెడు మూరెడు పొడవుగ నుండునని శాస్త్రజ్ఞ లెఱుఁగుదురు. గ్రీకు ల్యాటిన్ భాషలు దేవభాషలుగాఁ గల జర్మనీ వారికి వీని నంగీకరించుటకు నభ్యంతర ముండఁగూడదుకదా ? కాని వారీ దీర్ఘపదములకుఁ దమభాషలో మాఱు పదములను గల్పించుకొని విద్యార్థుల నిమిత్తమై వ్రాయఁబడు పొత్తము లలో వానినే వాడుచున్నారు ! జర్మనీ దేశజ్ఞులే యిట్లుచేయఁ బూర్తిగ భిన్న భాషాసంప్రదాయము గల మన మా కర్కశపదంబులనే సంస్కారమైనఁ జేయక తీసికొనవలె ననుట వింతగను విపరీతంబుగను గన్పట్టుట లేదా ? కావున మనము వీలయినంతవఱకు దేశ్యపదములను, వాడుకలోనున్న సంస్కృతపదములను వాడవలయును. అట్టిపదములు లేనప్పడు సంస్కృత వాఙ్మయమునుండి సమానార్ధకముల నిచ్చుపదముల నుపయోగించుకొన