పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక వ్యక్తి కొనిపోవుచున్న ఆస్తిని దొంగిలించు ప్రయత్నములో దౌర్జన్యము, లేక ఆపరాధిక బల ప్రయోగము చేయుట.

356. ఒక వ్యక్తి ధరించియున్న దానిని లేక కొనిపోవుచున్న ఏదేని ఆస్తిని దొంగిలించు ప్రయత్నములో ఆ వ్యక్తి పై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములో గాని, జర్మానాలోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఒక వ్యక్తిని అక్రమముగ పరిరోధించు ప్రయత్నములో దౌర్జన్యము, లేక ఆపరాధిక బలప్రయోగము చేయుట.


357. ఏ వ్యక్తి నైనను ఆక్రమముగ పరిరోధించు ప్రయత్నములో ఆ వ్యక్తి పై దౌర్జన్యము, లేక ఆపరాధిక బలప్రయోగము చేయు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

తీవ్ర ప్రకోపనమునకు లోనై దౌర్జన్యము, లేక ఆపరాధిక బల ప్రయోగము చేయుట.


358. ఏ వ్యక్తి యై నను కలిగించిన తీవ్ర ఆకస్మిక ప్రకోపనము వలన ఆ వ్యక్తి పై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, రెండు వందల రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటిలోగాని శిక్షింపబడుదురు.

విశదీకరణము: ఈ కడపటి పరిచ్చేదము 352 వ పరిచ్చేదమునకు గల విశదీకరణమునకు లోనై యుండును.

వ్యపహరణము, అపహరణము బానిసత్వము మరియు బలవంతపు చాకిరిని గురించి

వ్యపహరణము.

359. వ్యపహరణము రెండు విధములు : భారత దేశమునుండి వ్యపహరించుట మరియు శాసన సమ్మత సంరక్షణ నుండి వ్యవహరించుట.

భారత దేశము నుండి వ్యవహరించుట.

360. ఎవరేని వ్యక్తిని, ఆ వ్యక్తి సమ్మతి లేకుండ, లేక ఆ వ్యక్తి తరపున సమ్మతించుటకు శాసనిక ప్రాధికారము గల వ్యక్తి సమ్మతి లేకుండ, భారతదేశపు సరిహద్దుల ఆవలకు కొంపోవు వారెవరైనను,ఆ వ్యక్తిని భారతదేశమునుండి వ్యవహరించినట్లు చెప్పబడుదురు.

శాసన సమ్మత సంరక్షణము నుండి వ్యవహరించుట.

361. పురుషుడైనచో పదహారు సంవత్సరముల లోపు వయస్సుగల, స్త్రీ అయినచొ పదునెనిమిది సంవత్సరముల లోపు వయస్సుగల, ఎవరేని మైనరును లేక మతిస్తిమితము లేని ఎవరేని వ్యక్తి ని, అట్టి మైనరు యొక్క లేక అట్టి మతిస్తి మితము లేని వ్యక్తి యొక్క శాసనసమ్మత సంరక్షకుని రక్షణమునుండి, అట్టి సంరక్షకుని సమ్మతి లేకుండ తీసికొనిపోవు, లేక ఆశ చూపి తన వెంటవచ్చునట్లు చేయు వారెవరైనను, అట్టిమై నరును లేక ఆ వ్యక్తిని శాసన సమ్మత సంరక్షణము నుండి వ్యవహరించినట్లు చెప్పబడుదురు.

విశదీకరణము: ఈ పరిచ్చేదములోని “ శాసనసమ్మత సంరక్షకుడు ' అను పదపరిధియందు శాసనసమ్మతముగ అట్టి మైనరు, లేక ఇతర వ్యక్తి యొక్క రక్షణభారమునుగాని అభిరక్ష నుగాని అప్పగింపబడిన వ్యక్తి ఎవరైనను చేరియుండును.

మినహాయింపు : అనౌరసుడైన బిడ్డకు తానే తండ్రినని సద్భానముతో విశ్వసించునట్టి , లేక అట్టి బిడ్డ యొక్క శాసన సమ్మత అభిరక్షకు తానే హక్కుదారునని సద్భావముతో విశ్వసించునట్టి ఎవరేని వ్యక్తి చేయు కార్యమునకు అట్టి కార్యము దుర్నీతికరమైన, లేక శాసనవిరుద్ధమైన ప్రయోజనముకొరకు చేయబడినదైననే తప్ప, ఈ పరిచ్చేదము విస్తరించదు.

అపహరణము.

362. బల ప్రయోగముతో నిర్భంధ పెట్టి గాని, మోసముతో కూడిన ఏవేని పద్ధతులతో ప్రేరేపించి గాని, ఎవరేని వ్యక్తిని ఏదేని స్థలమునుండి వెళ్లి పోవునట్లు చేయు వారెవరైనను ఆ వ్యక్తిని అపహరణము చేసినట్లు చెప్పబడుదురు.

వ్యవహరించినందుకు శిక్ష,

363. ఏ వ్యక్తి నైనను భారతదేశమునుండిగాని, శాసన సమ్మత సంరక్షణమునుండిగాని వ్యవహరించు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షంపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బిచ్చమెత్తించుటకు మైనరును వ్యవహరించుట లేక ఆవిటివానిని చేయుట.

363-ఏ. (1) ఎవరేని మైనరు, బిచ్చమెత్తుటకై నియోగింపబడుటకు గాను, లేక ఉపయోగింపబడుటకుగాను ఆ మైనరును వ్యవహరించు, లేక అందుకై , ఆ మైనరుయొక్క శాసన సమ్మత సంరక్షకుడు కాకుండియు, ఆ మైనరు యొక్క అభిరక్షను పొందువారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు,