పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దౌర్జన్యము.

351. ఏ వ్యక్తి యైనను తానుచేయు ఏదేని సైగలేక సన్నాహము అచటనే ఉన్న ఎవరేని వ్యక్తి పై తాను ఆపరాధిక బలప్రయోగము చేయబోవుచున్నట్లు భీతిని అతనికి కలిగించవలెనను ఉద్దేశముతో లేక అట్టి భీతి కలుగగలదని తెలిసియుండి, అట్టి సైగ లేక సన్నాహము చేసినయెడల అతడు దౌర్జన్యము చేసినట్లు చెప్పబడును,

విశదీకరణము : -- మాటలు మాత్రమే దౌర్జన్యము కానేరపు : అయితే, ఒక వ్యక్తి అనెడి మాటలు అతని సైగలకు, లేక సన్నాహములకు ఆపాదించు అర్దము వలన ఆ సైగలు లేక సన్నాహములు దౌర్జన్యము కావచ్చును.

ఉదాహరణములు

(ఏ), 'జడ్' ను 'ఏ' కొట్టబోవుచున్నాడని 'జడ్' విశ్వసించునట్లు చేయవలెనను ఉద్దేశముతో, లేక అట్లు విశ్వసింపజేయగలనని తెలిసియుండి, 'జడ్' వైపు 'ఏ' తన పిడికిలిని చూపును. 'ఏ' దౌర్జన్యము చేసిన వాడగును.

(బీ) ఒక భీకరమైన కుక్కను 'జడ్' పై పడునట్లు 'ఏ' చేయబోవుచున్నాడని 'జడ్' విశ్వసించునట్లు చేయవలెనను ఉద్దేశముతో లేక అట్లు విశ్వసింపజేయగలనని తెలిసియుండి, 'ఏ' ఆ కుక్క యొక్క మూతి కట్టు సడలింప ప్రారంభించును, 'జడ్' పై 'ఏ' దౌర్జన్యము చేసిన వాడగును.

(సీ) “నిన్ను కొడతాను" అని 'జడ్' కు చెప్పును 'ఏ' కర్రను ఎత్తును. ఇచట 'ఏ' అనిన మాటలు ఎట్టి సందర్బములోను దొరన్యము క్రిందికి రానప్పటికిని, ఏ ఇతర పరిస్థితుల తోను కూడియుండనిచో చేసిన సైగ మాత్రమే దౌర్జన్యము క్రిందికి రాలేక పోయినప్పటికీని మాటలతో స్పష్టము చేయబడిన ఆ సైగ దౌర్జన్యము క్రిందికి రావచ్చును.

తీవ్ర ప్రకోపనము వలన గాక అన్యధా దౌర్జన్యము లేక ఆపరాధిక బలప్రయోగము చేసినందుకుశిక్ష.

352. ఒక వ్యక్తి కలిగించిన తీవ్ర ఆకస్మిక ప్రకోపనమువలన గాక అన్యధా ఆ వ్యక్తి పై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ గాని ఐదువందల రూపాయల దాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

విశదీకరణము :-- తీవ్ర ఆకస్మిక ప్రకోపనము ఆ అపరాధమునకు ఒక సాకుగా అపరాధియే కోరి తెచ్చుకొనినది గాని స్వచ్చందముగ కలిగించిన ప్రకోపనా ఫలితమైనది గాని అయినచో, లేక

ఆ ప్రకోపనము, శాసనమును పాటించుటలో చేయబడిన దేనివల్ల నైనను, పబ్లికు సేవకుని యొక్క అధికారములను శాసన సమ్మతముగ వినియోగించుటలో అట్టి పబ్లికు సేవకునిచే చేయబడిన దేనివల్ల నైనను కలిగించబడినదైనచో, లేక

ఆ ప్రకోపనము స్వయం రక్షణ హక్కును శాసన సమ్మతముగ వినియోగించుటలో చేయబడిన దేనివల్ల నైనను కలిగించబడినదైనచో---

అది ఈ పరిచ్చేదము క్రింది అపరాధమునకు గల శిక్షను తగ్గించదు.

ఆ ప్రకోపనము, అపరాధమునకుగల శిక్షను తగ్గించుటకు సరిపోవునంత తీవ్రమైనది, ఆకస్మికమై నది అగునా అనునది సంగతిని గూర్చిన ప్రశ్న అగును.

పబ్లికు సేవకుని భయపెట్టి అతడు కర్త వ్యమును నిర్వహించుటను మానుకొనునట్లు చేయుటకై దౌర్జన్యము, లేక అపరాధికణల ప్రయోగము చేయుట.

353. పబ్లికు సేవకుడగు ఏ వ్యక్తి కైనను, అతడు అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును నిర్వహించ చున్నపుడు గాని, ఆ వ్యక్తిని అట్టి పబ్లికు సేవకుడుగ. తన కర్తవ్యమును నిర్వహింపకుండ చేయ వలెనను లేక భయపెట్టి మానుకొనునట్లు చేయవలెనను ఉద్దేశముతో గాని, ఆ వ్యక్తి చే అట్టి పబ్లికు సేవకుడుగ తన కర్తవ్యమును శాసన సమ్మతముగా నిర్వహించుటలో చేసిన, లేక చేయుటకు ప్రయత్నించిన పనియొక్క ఏదేని పరిణామముగా గాని, దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

స్త్రీకి లజ్జా భంగము కలిగించు ఉదేశ్యముతో ఆమెపై దౌర్జన్యము లేక ఆపరాధిక బలప్రయోగము చేయుట.

354. ఏ స్త్రీ కైనను లజ్జా భంగము కలిగించు ఉద్దేశముతో లేక ఆమెకు లజా భంగము కలుగగలదని ఎరిగి ఆమె పై దౌర్యనము లేక అపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

తీవ్ర ప్రకోపనము వలన గాక అన్యధా ఒక వ్యక్తిని అగౌరవపరచు ఉద్దేశముతో దౌర్జన్యము లేక ఆపరాధిక బలప్రయోగము చేయుట.

355. ఒక వ్యక్తి కలిగించిన తీవ్ర ఆకస్మిక ప్రకోపనముసకులోనై గాక అన్యధా, ఆ వ్యక్తి పై దౌర్జన్యము, లేక అపరాధిక బల ప్రయోగము చేసి అతనిని అగౌరపపరచవలెనను ఉద్దేశముతో అతనిపై దౌర్జన్యము లేక ఆపరాధిక బల ప్రయోగము చేయు వారెవరైనను రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.