పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇతరుల ప్రాణమునకు గాని శరీరమునకుగాని అపాయకరమగు కార్యము చేసి ఘాతను కలిగించుట.

337. మనుష్య ప్రాణమునకుగాని, ఇతరుల శరీరమునకు గాని అపాయము కలుగునంతటి తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేయుట ద్వారా ఏ వ్యక్తి కైనను ఘాత కలిగించు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి, రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగానీ ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఇతరుల ప్రాణమునకు గాని శరీరమునకుగాని అపాయకరమగు కార్యము చేసి దారుణమైన ఘాతను కలిగించుట.

338. మనుష్య ప్రాణమునకుగాని, ఇతరుల శరీరమునకు గాని ఆపాయము కలుగునంతటి తొందరపాటుతో లేక నిర్లక్ష్యముతో ఏదేని కార్యమును చేయుటద్వారా ఏ వ్యక్తి కైనను దారుణమైన ఘాతను కలిగించువారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయల దాక ఉండగల జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

అక్రమ అవరోధమును, అక్రమ పరిరోధమును గురించి :

అక్రమ అవరోధము.

339. ఏ వ్యక్తి నైనను అతడు వెళ్లుటకు హక్కుగల ఏదేని దిశలో పోకుండా చేయుటకై ఆ వ్యక్తిని స్వచ్ఛందముగా ఆటంకపరచు వారెవరైనను ఆ వ్యక్తిని ఆక్రమముగ ఆవరోధించినట్లు చెప్పబడుదురు,

మినహాయింపు :- భూమి పై లేక నీటి పై గల ప్రయివేటు దారిని ఆటంకపరచుటకు తనకు శాసన సమ్మతమైన హక్కు ఉన్నదని సద్భావముతో విశ్వసించువ్యక్తి ఆటంకపరచుట ఈ పరిచ్ఛేద భావములో అపరాధము కాదు,

ఉదాహరణము

ఒకదారి వెంట పోవుటకు 'జడ్'కు హక్కు ఉండగా, ఆ దారిని ఆటంకపరచుటకు తనకు హక్కుగలదని సద్భావముతో విశ్వసించకయే 'ఏ' ఆదారిని ఆటంకపరచును, అందువలన 'జడ్' ఆ దారి వెంట పోలేకపోయెను. 'ఏ' ఆక్రమముగా 'జడ్' ను ఆవరోధించిన వాడగును.

అక్రమ పరిరోధము.

340. ఏ వ్యక్తి నైనను అన్ని వైపుల నిశ్చిత హద్దులను దాటి పోకుండునట్లుగా ఆక్రమముగా అవరోధించి వారెవరైనను, ఆ వ్యక్తిని “ఆక్రమముగ పరిరోధించి” నట్లు చెప్ప బడుదురు.

ఉదాహరణములు

(ఏ) చుట్టూ గోడగల స్థలము లోనికి 'జడ్' పోవునట్లు చేసి, అందులో 'జడ్' ఉండగా 'ఏ' దానికి తాళము వేయును. ఆ విధముగా 'జడ్' తన చుట్టూ ఉన్న గోడల హద్దును దాటి, ఏ దిశలోనూ పోలేకుండ చేయబడినాడు."ఏ" అక్రమముగ 'జడ్'ను పరిరోధించిన వాడగును.

(బీ) ఒక భవనపు ద్వారములవద్ద తుపాకులతో మనుష్యులను 'ఏ' కాపలా ఉంచి, 'జడ్'కు ఆ భవనము నుండి అతడు బయటకి పోవుటకు ప్రయత్నించినచో వారు 'జడ్'ను కాల్చివేసెదరని, 'ఏ' చెప్పును. 'ఏ' అక్రమముగా 'జడ్'ను పరిరోధించిన వాడగును.

అక్రమముగా అవరోధించినందుకు శిక్ష

341. ఏ వ్యక్తి నైనను అక్రమముగ అవరోధించు వారెవరైనను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఆక్రమముగా పరిరోధించినందుకు శిక్ష.

342. ఏ వ్యక్తి నైనను అక్రమముగ పరిరోధించు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మూడు లేక అంతకంటె ఎక్కువ దినముల వరకు అక్రమ పరిరోధను.

343. మూడు లేక అంతకంటే ఎక్కువ దినములవరకు ఏ వ్యక్తినైనను , అక్రమముగా పరిరోధించు వారెవరై నను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

పది లేక అంతకంటే ఎక్కువ దినముల వరకు అక్రమ పరిరోధము.


344. పది లేక అంతకంటే ఎక్కువ దినములవరకు ఏ వ్యక్తి నైనను ఆక్రమముగ పరిశోధించు వారెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.