పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6


“విలువైన సెక్యూరిటీ"

30. “విలువైన సెక్యూరిటీ” అను పదములు, ఏ దస్తావేజుద్వారా ఏదేని శాసనిక హక్కు యొక్క ఏర్పాటు, విస్తరణ, బదిలీ, పరిమితము, నిర్మూలనము లేక విడుదల చేయబడునో, లేక ఏ దస్తావేజుద్వారా ఎవరేని వ్యక్తి తాను శాసనిక బాధ్యత కలిగి ఉన్నట్లు గాని తనకు ఒక నిర్దిష్ట శాసనిక హక్కు లేనట్లు గాని అంగీకరించునో ఆ దస్తావేజును లేక అట్లుగ తాత్పర్యమిచ్చు దస్తా వేజును తెలుపును.

ఉదాహరణము

ఒక వినిమయపత్రము వెనుకవైపు 'ఏ' తన పేరును వ్రాయును, ఈ పీటీ వ్రాతవలన శాసన సమ్మతముగా ఆ వినిమయపత్రదారు లగునట్టి ఏ వ్యక్తి కైనను ఆ పత్రము పై గల హక్కు బదిలీ అయినందున ఆ పీటీ వ్రాత ఒక “విలువైన సెక్యూరిటీ” అగును.

"వీలునామా"

31. వీలునామా" అను పదము ఏదేని మరణశాసనాత్మకమైన దస్తావేజును తెలుపును.

కార్యములను నిర్దేశించు పదముల పరిధిలో కార్యాలోపములు శాసనవిరుద్ధమైనవి చేరియుండుము

32. ఈ స్మృతియొక్క ప్రతి భాగమునందును, సందర్భమును బట్టి ఉద్దేశ వైరుధ్యము కాన్పించిన నేతప్ప, చేసిన కార్యములను నిర్దేశించునట్టి పదములు కార్యలోపములకు కూడా అని శాసన విరుద్ధమైనవై నప్పుడు, వర్తించును.

"కార్యము"

33. “కార్యము" అను పదము ఒక కార్యమునేగాక కార్యపరంపరను కూడ తెలుపును.

“కార్యలోపము ”

“కార్యలోపము" అను పదము ఒక కార్యలోపమునే గాక కార్యలోపపరంపరను కూడ తెలుపును.

ఉమ్మడి ఉద్దేశసాధనకై ఆనేకమంది వ్యక్తులచే చేయబడిన కార్యములు.

34. అనేకమంది వ్యక్తులు ఒక ఆపరాధిక కార్యమును వారందరి ఉమ్మడి ఉద్దేశ్య సాధనకై చేసినపుడు అట్టి వారిలో ప్రతి వ్యక్తియు తానొక్కడే ఆ కార్యము చేసియుండిన ఎట్టా అదే రీతిగా ఆ కార్యమునకు బాధ్యుడగును.

అటువంటి కార్యమును నేరము చేయుచున్నానని ఎరిగియు లేక నేరము చేయు ఉద్దేశముతో చేసిన కారణమున ఆది నేరము అయినపుడు.

35. నేరము చేయుచున్నానని ఎరిగియు లేక నేరము చేయు ఉద్దేశముతో చేసిన కారణముస మాత్రమే నేరమగు కార్యము, అనేక మంది వ్యక్తులు చేసినపుడెల్లను ఆ కార్యములో అట్టి ఎరుకతో లేక ఉద్దేశముతో పాల్గొను వారిలో ప్రతి వ్యక్తియు, తానొక్కడే ఆ కార్యమును ఆ ఎరుకతో లేక ఆ ఉద్దేశముతో చేసియుండిన ఎట్లో అదేరీతిగ ఆ కార్యమునకు బాధ్యుడగును.

కార్యమువలన కొంత, కార్యలోపమువలన కొంత కలిగిన ప్రభావము.

36. ఒక కార్యము వలన గాని, ఒక కార్యలోపము వలన గాని ఒకానొక ప్రభావమును కలిగించుట లేక అట్టి ప్రభావమును కలిగించుటకు ప్రయత్నించుట, అపరాధమై నపుడెల్లను, ఆ ప్రభావమును, కార్యము వలన కొంత కార్యలోపమువలన కొంత కలిగించుట అదే అపరాధముగా అర్ధము చేసికొనవలెను.

ఉదాహరణము

'జడ్'కు తిండి పెట్టుటను శాసన విరుద్దముగ మానినందున కొంతవరకును, 'జడ్'ను కొట్టుటవలన కొంత వరకును జడ్'కు మరణమును 'ఏ' ఉద్దేశపూర్వకముగా కలిగించును. 'ఏ' హత్యచేసిన వాడగును.

ఒక అపరాధమగు అనేక కార్యములలో ఒక దానిని చేయుట ద్వారా సహకరించుట,

37. అనేక కార్యముల ద్వారా ఒక అపరాధము చేయబడినపుడు, ఆ కార్యములలో ఏ ఒకదానినైనను, ఒకరుగా గాని ఎవరేని ఇతర వ్యక్తి తో కలసిగాని చేయుట ద్వారా ఆ అపరాధము చేయుటయందు ఉద్దేశపూర్వకముగ సహకరించు వారెవరైనను ఆ అపరాధము చేసిన వారగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' యు 'బి' యు వేరు వేరు సమయములలో 'జడ్'కు చిన్న చిన్న మోతాదులలో విషము నిచ్చుట ద్వారా అతనిని హత్య చేయుదమని ఒప్పందము జరుపు కొందురు. 'ఏ' యు 'బి' యు ఆ ఒప్పందము, ప్రకారము 'జడ్'ను హత్యచేయు ఉద్దేశముతో విష ప్రయోగము చేయుదురు. అతనికి అట్లు అనేక సార్లు ఈయబడిన మోతాదుల విష ప్రభావము వలన 'జడ్' మరణించును. ఇచట 'ఏ' యు 'బి' యు ఈ హత్య చేయుటలో ఉద్దేశ పూర్వకముగా సహకరించుకొందురు. మరియు వారిలో ప్రతి ఒకరు, మరణమును కలిగించిన కార్యములలో ఒక దానిని చేసినందున, వారి కార్యములు వేరు వేరువి అయినప్పటికిని, వారుభయులు అపరాధమును చేసిన వారగుదురు.

(బీ) 'ఏ' యు 'బీ' యు సహ-జై లర్లయినందున ఒకరు మారి ఒకరు తడవకు ఆరు గంటల చొప్పున 'జడ్' అను ఖైదీని కాపలా కాయు బాధ్యత కలిగియున్నారు. 'జడ్'కు మరణమును కలిగించు ఉద్దేశముతో 'ఏ' యు 'బీ' యు, 'జడ్' కొరకు తమకంద జేయబడిన తిండిని తమ కాపలావేళలలో శాసన విరుద్ధముగ అతనికి