పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశదీకరణము 3: తల్లి గర్భమునందున్న బిడ్డకు మరణమును కలుగజేయుట మానవవధ కాదు. కాని ప్రాణముతో ఉన్న బిడ్డకు ఆ బిడ్డ శ్వాస పీల్చకున్నప్పటికిని, లేక పూర్తిగా బయటపడనప్పటికిని, ఆ బిడ్డ యొక్క శరీర భాగము ఏదైనా బయటకు వచ్చియుండినచో, ప్రాణముతోయున్న బిడ్డ కు మరణము కలుగజేసిన అది అపరాధిక మానవవధ కావచ్చును.

హత్య,

300. ఇందు ఇటు పిమ్మట మినహాయింపబడిన కేసులలో తప్ప, మరణమును కలుగజేసిన కార్యము, మరణ మును కలుగజేయవలెనను ఉద్దేశముతో చేయబడినచో, లేక--

రెండవది:—ఆ కార్యము కీడు కలిగింపబడిన వ్యక్తి కి మరణము కలిగించగలదని అపరాధికి తెలిసియున్నట్టి శారీరక హానిని కలిగించు ఉద్దేశముతో చేయబడినదైనచో, లేక—

హత్య,

మూడవది:—ఆ కార్యము ఏ వ్యక్తి కైనను శారీరక హానిని కలుగజేయ వలెనను ఉద్దేశముతో చేయబడియుండి కలుగజేయ ఉద్దేశింపబడినట్టి శారీరక హాని మరణమును కలుగజేయుటకు సహజముగా సరిపోవునంతదైనచో, లేక--

నాల్గవది: ఆ కార్యము మరణమునుగాని, మరణమును కలిగించగల శారీరక హానినిగాని, బహుశ: కలుగజేయ జాలునంతటి ఆసన్నమైన అపాయముతో కూడినదని ఆ కార్యము చేయు వ్యక్తి కి తెలిసియుండి మరణమునుగాని, పైన చెప్పినటువంటి హానినిగాని కలుగజేయు ముప్పుకు గురిచేయుటకు కారణమేదియు లేకుండగనే, అతడు అట్టి కార్యమును చేసినచో ఆపరాధిక మానవవధ హత్య అగును.

ఉదాహరణములు

(ఏ) 'జడ్'ను చంపవలెనను ఉద్దేశముతో 'ఏ' అతనిని షూట్ చేయును. తత్పరిణామముగా 'జడ్' మరణించును. 'ఏ' హత్య చేసినవాడగును.

(బి) ఒక దెబ్బలోనే మరణము సంభవించునంతటి వ్యాధితో 'జడ్' బాధపడుచున్నాడని తెలిసియుండియు 'ఏ' శారీరక హానిని కలుగజేయవలెనను ఉద్దేశముతో 'జడ్' ను కొట్టును. ఆ దెబ్బవలన 'జడ్' మరణించును. ఆ దెబ్బ, సహజముగ ఆరోగ్యవంతుడైన వ్యక్తి కి మరణమును కలిగించునంతటిది కాకున్నను, 'ఏ' హత్య చేసిన వాడగును. కాని 'జడ్' ఏదేని వ్యాధితో బాధపడుచున్నాడని తెలియక, సహజముగ ఆరోగ్యవంతుడైన వ్యక్తి కి మరణమును కలిగించలేని దెబ్బ కొట్టినచో, ఇచట 'ఏ' శారీరక హాని కలుగ జేయుటకు ఉద్దేశించినప్పటికిని, మరణము కలిగించు ఉద్దేశము గాని, సహజముగా మరణము కలిగించగల శారీరక హానిని కలిగించు ఉద్దేశము గాని అతనికి లేకుండినచో, ఆతడు హత్య చేసిన వాడు కాదు.

(సీ) సహజముగా ఒక మనిషికి మరణమును కలిగించు నంతగా 'జడ్' ను కత్తితో గాని, దుడ్డు కర్రతో గాని 'ఏ' ఉద్దేశపూర్వకముగా గాయపరచును. తత్పరిణామముగా 'జడ్' మరణించును. ఇచట 'జడ్' కు మరణము కలిగించవలెనను ఉద్దేశము 'ఏ' కు లేకుండినప్పటికిని 'ఏ' హత్య చేసిన వాడగును.

(డీ) కారణమేదియు లేకుండగనే 'ఏ' వ్యక్తుల గుంపు పై బారు చేసిన ఫిరంగిని ప్రేల్చి, అందులో ఒకరిని చంపును. ప్రత్యేకముగా ఏ వ్యక్తినై నను చంపవలెనని ముందు పన్నుగడ ఏదియు 'ఏ' కు లేక పోయినప్పటికిని, ఆతడు హత్య చేసిన వాడగును.

ఆపరాధిక మానవ వధ ఎప్పుడు హత్య కాదు.

మినహాయింపు 1:—అపరాధి తీవ్ర, ఆకస్మిక ప్రకోపనమునకు లోనై తనను తాను అదుపులో పెట్టుకొనగల శక్తిని కోల్పోయినప్పుడు, ప్రకోపనము కలిగించిన వ్యక్తి కి మరణమును కలుగజేసినచో, లేక పొరపాటు వలన గాని, దుర్ఘటన వలన గాని ఎవరేని ఇతర వ్యక్తి కి మరణమును కలుగజేసినచో, ఆపరాధిక మానవవధ హత్య కాదు.

పై మినహాయింపు యీ క్రింది మినహయింపులకు లోబడియుండును:

మొదటిది :—ఆ ప్రకోపనము, ఏ వ్యక్తినైనను చంపుటకు, లేక ఏ వ్యక్తి కై నను కీడు కలుగజేయుటకు ఒక సాకుగా, అపరాధియే కోరితెచ్చుకొనినదిగా గాని, అపరాధియే స్వచ్ఛందముగా కలిగించిన ప్రకోవవా పనితమై నదిగా గాని అయి ఉండరాదు.

రెండవది :- ఆ ప్రకోపనము, శాసనమును పాటించుటలో చేయబడిన దేనివల్ల నైనను, పబ్లికు సేవకునియొక్క అధికారములను శాసన సమ్మతముగా వినియోగించుటలో అట్టి పబ్లికు సేవకునిచే చేయబడిన దేనివల్ల నైనను కలిగించబడినదై ఉండరాదు.