పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మత సమావేశమునకు విఘ్నము కలుగజేయుట.


296. మతసంబంధమైన ఆరాధనను గాని, మతసంస్కారములను గాని శాసన సమ్మతముగా నిర్వర్తించు కొనుచున్న ఏదేని సమా వేశమునకు స్వచ్ఛందముగా విఘ్నము కలుగజేయు వారెవరైనను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింప బడుదురు.

స్మశానవాటికలు స్మశానవాటికలు అక్రమముగ ప్రవేశించుట

297. ఏ వ్యక్తి మనస్సునైనను నొప్పించవలెననెడి లేక ఏ వ్యక్తి మతమునైనను అవమానపరచవలెననెడి ఉద్దేశముతోగాని, తద్వారా ఎవరేని వ్యక్తి యొక్క మనస్సు నొప్పించబడగలదని లేక ఎవరేని వ్యక్తి యొక్క మతము అవమానపరచబడగలదని ఎరిగియుండియు,

ఏదేని ఆరాధనా స్ఠలము నందైనను, ఏదేని స్మశానవాటిక పై నై నను అంత్య క్రియలను జరుపుటకై లేక మృతుల అవశేషములను భద్రముగానుంచుటకై కేటాయింపబడిన ఏదేని స్థలము పై నైనను అక్రమముగ ప్రవేశించు లేక ఏ మనుష్య శవమునై నను ఆవజ్ఞకు గురిచేయు, లేక అంత్య క్రియలను జరుపుట కొరకు సమావేశమైన ఏ వ్యక్తులకైనను విఘ్నము కలిగించు వారెవరైనను ఒక సంవత్సరము దాక ఉండగల కాలావధికి ఇంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

మత విషయకముగా మనస్సు నొప్పించు ఉద్దేశముతో బుద్ది పూర్వకముగా మాట అనుట మొదలగునవి.

298. మత విషయకముగా ఎవరేని వ్యక్తి మనస్సును నొప్పించవలెనను ఉద్దేశముతో బుద్ధి పూర్వకముగా ఆవ్యక్తి వినునట్లు ఏవేని మాటలను అను, లేక ఏదేని ధ్వనిని చేయు, లేక ఆ వ్యక్తి కి కనపడునట్లు ఏదేని సైగ చేయు, లేదా ఏదేని వస్తువును ఉంచు వారెవరైనను, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

అధ్యాయము-16

మనుష్య శరీర విషయమున ఆపరాధములు ప్రాణహానికర ఆపరాధములను గురించి

అపరాధిక మానవ వధ.

299. మరణము కలుగజేయవలెనను ఉద్దేశముతో లేక మరణమును కలిగించగల శారీరక హానిని కలుగజేయవలెనను ఉద్దేశముతో ఒక కార్యమును చేయుట ద్వారా గాని, అట్టి కార్యమువలన ఆ మరణము కలిగించగలనని ఎరిగియుండి ఆ కార్యమును చేయుటద్వారా గాని, మరణమును కలుగజేయు వారెవరైనను ఆపరాధిక మానవవధ అను అపరాధమును చేసిన వారగుదురు.

ఉదాహరణములు

(ఏ) 'ఏ' అను నతడు మరణమును కలుగజేయవలెనను ఉద్దేశముతో గాని, మరణము కలుగగలదని ఎరిగియుండిగాని, ఒక గొయ్యిని పుల్లలతోను, గడ్డి తోను కప్పును. 'జడ్' ఆ నేల గట్టి దేనని విశ్వసించుచూ దాని పై నడచివెళ్లి గోతిలో పడి చనిపోవును. ఏ ఆపరాధిక మానవవధ ఆను అపరాధమును చేసినవాడగును.

(బి) 'జడ్' ఒక పొదవెనుక ఉన్నాడని 'ఏ' కు తెలియును. 'బి' కి ఆది తెలియదు. 'జడ్' కు మరణము కలుగజేయవలెనను ఉద్దేశముతో, లేక మరణము కలుగగలదని తెలిసియుండియు, 'ఏ' ఆ పొదవై పు కాల్పులు జరుపుమని 'బీ' ని ప్రేరేపించును. కాల్పులు జరిపి 'జడ్' ను చంపును. ఇచట 'బి' ఎట్టి అపరాధమును చేసినవాడు కాకపోవచ్చును కాని, 'ఏ' ఆపరాధిక మానవవధ అను అపరాధమును చేసిన వాడగును.

(సి) ఒక కోడిని చంపి దానిని దొంగిలించవలెనను ఉద్దేశముతో 'ఏ' దాని పై తుపాకి కాల్చి, పొదవెనుక ఉన్నట్టి 'బి' ని చంపును, కాని ఆతడు అచట ఉన్నాడని 'ఏ' కు తెలియదు. ఇచట 'ఏ' శాసనవిరుద్ధమైన కార్యమును చేయుచుండినప్పటికినీ, అతనికి 'బీ' ని చంపవలెనను ఉద్దేశములేదు. మరణము కలుగగలదని తాను ఎరిగియున్నట్టి కార్యమును చేసి అతడు మరణము కలిగించలేదు. అందువలన 'ఏ' ఆపరాధిక మానవవధ అను అపరాధమును చేయలేదు.

విశదీకరణము 1 :-ఎవరేని వ్యక్తి, అస్వస్థత, రోగము లేక శారీరక దౌర్బల్యముతో బాధపడుచున్న మరోక వ్యక్తి కి శారీరక హానిని కలుగజేసి తద్వారా ఆ మరొక వ్యక్తి త్వరగా మరణించునట్లు చేసినచో, అతడు మరణమును కలుగజేసినట్లు భావించవలెను.

విశదీకరణము 2:-శారీరక హానిద్వారా మరణము కలుగజేయబడిన యెడల, సరియైన వైద్యోపచారముల నైపుణ్యముగల చికిత్స జరిపి యుండినచో మరణము నివారింపబడి యుండెడిదైనప్పటికీ, అట్టి శారీరక హాని కలుగజేసిన వ్యక్తి ఆ మరణమును కలుగజేసినట్లు భావించవలెను.