పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అశ్లీ లకరమైన పుస్తకములు మున్నగు వాటి విక్రయము మొదలగునవి.

292. (1) ఉపపరిచ్ఛేదము (2) నిమిత్తము ఒక పుస్తకమును, కరపత్రమును, పత్రికను, వ్రాతను, రేఖా చిత్రమును, వర్ణ చిత్రమును, రూపణమును, ఆకృతిని లేక ఏదేని ఇతర వస్తువును, అది కామాతురతను కలిగించు నదైనచో, కామ వాంఛలను ప్రేరేపించునదైనచో, లేక దాని ప్రభావముగాని ( అది రెండు లేక అంత కెక్కువ విభిన్నాంశములతో కూడినదైనయెడల) ఏదేని ఒక అంశపు ప్రభావముగాని, మొత్తముగా తీసికొనబడినపుడు దాని ప్రభావము గాని అన్ని సందర్భములను బట్టి అందలి, లేక అందు పొందుపరచిన విషయమును చదువగల, చూడగల లేక వినగల వ్యక్తులను దుర్నీతిపరులుగను, అవినీతిపరులుగను చేయు వైఖరిగలదైనచో, అశ్లీలకరమై నదిగా భావించవలెను.

(2) (ఏ) ఏదేని అశ్లీ ల కరమైన పుస్తకమును, కరపత్రమును, పత్రికను, రేఖా చిత్రమును, వర్ణ చిత్రమును, రూపణమును, ఆకృతిని, లేక ఏదేని ఇతర అశ్లీలకరమైన వస్తువును, అది ఏదైనప్పటికిని విక్రయించు, కిరాయికిచ్చు, పంచి పెట్టు, బహిరంగముగ ప్రదర్శించు లేక ఏ రీతిగ నైనను ప్రచారములో పెట్టు, లేక విక్రయించుటకు, కిరాయి. కిచ్చుటకు, పంచి పెట్టుటకు, బహిరంగముగ ప్రదర్శించుటకు, లేక ప్రచారములో పెట్టుటకు దానిని రచించు, తయారుచేయు, తన స్వాధీనము నందు కలిగియుండు, లేక

(బి) ఏదేని అశ్లీ లకరమైన వస్తుపు, పైన చెప్పబడిన ఏ ప్రయోజనము కొరకై నను విక్రయింపబడునని,కిరాయి కీయబడునని, పంచి పెట్టబడునని, లేక బహిరంగముగ ప్రదర్శింపబడునని, లేక ఏ రీతిగనై నను ప్రచారములో పెట్టబడునని ఎరిగియుండిగాని, అట్లు విశ్వసించుటకు కారణముండిగాని, అట్టి వస్తువును దిగుసుతి చేయు, ఎగుమతి చేయు లేక రవాణాచేయు, లేక

(సీ) పైన చెప్పబడిన ఏ ప్రయోజనము కొరకై నను అశ్లీ లకరమైన వస్తువులు ఏవై నను చేయబడునని, తయారు చేయబడునని, కొనబడునని, ఉంచబడునని, దిగుమతి చేయబడునని, ఎగుమతి చేయబడునని, రవాణా చేయుబడునని, బహిరంగముగ ప్రదర్శింపబడునని, లేక ఏ రీతిగవైనను ప్రచారములో పెట్టబడునని ఏ వ్యాపార సరళిలో తనకు తెలియ వచ్చినదో, లేక విశ్వసించుటకు కారణము కలిగినదో అట్టి ఏ వ్యాపారము నందైనను పాల్గొను, లేక దాని నుండి లాభములు పొందు లేక,

(డీ) ఎవరేని వ్యక్తి ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమగు నట్టి ఏ కార్యమునై నను చేయుచున్నాడని గాని చేయుటకు సిద్ధముగ నున్నాడనిగాని అట్టి అశ్లీ లకరమైన వస్తువును దేనినైనను ఏ వ్యక్తి నుండి యైనను, ఏ వ్యక్తి ద్వారానైనను సేకరింప వచ్చునని గాని, ప్రకటన చేయు, లేక ఏ పద్ధతుల ద్వారానై నను తెలియజేయు, లేక,

(ఈ) ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమగుపట్టి ఏదేని కార్యమును చేయజాపు, లేక చేయుటకు

ప్రయత్నించు, వారెవరైనను, మొదటి దోష, స్థాపనకై రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, రెండు వేల రూపాయలదాక ఉండగల జుర్మానాతోను శిక్షింపబడుదురు, మరియు రెండవ లేక, ఆ తరువాతి దోషస్థాపన జరిగిన సందర్భములో ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోను, ఐదువేల రూపాయలదాక ఉండగల జుర్మానాతో కూడాను శిక్షింపబడుదురు.

మినహాయింపు :-ఈ పరిచ్ఛేదము ఈ క్రింది వాటికి విస్తరించదు :--

(ఏ) (i) దేని ప్రచురణము వలన విజ్ఞాన శాస్త్రము, సాహిత్యము, కళ, విద్వత్తు , లేక ప్రజానీకమునకు సంబంధించిన ఇతర విషయముల యొక్క హితము పెంపొందింప బడునను ఆధారము పై ప్రజా శ్రేయస్సు దృష్ట్యా అట్టి ప్రచురణము సమర్థ నీయమని రుజువు పరచ బడునో అట్టి ఏదేని పుస్తకము, కరపత్రము, పత్రిక, వ్రాత, రేఖాచిత్రము, వర్ణ చిత్రము, రూపణము, లేక ఆకృతి, లేక,

(ii ) ఏది మత ప్రయోజనముల కొరకై సద్భావ పూర్వకముగా భద్రపరచబడునో, లేక ఉపయోగింపబడునో అట్టి ఏదేని పుస్తకము, కరపత్రము, పత్రిక, వ్రాత, రేఖాచిత్రము, పర చిత్రము, రూపణము, లేక ఆకృతి,