పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము -14

ప్రజల యొక్క ఆరోగ్యము, భద్రత, సౌకర్యము, సభ్యత మరియు

నైతిక వర్తనమునకు భంగము కలిగించు అపరాధములను గురించి.

పబ్లిక్ న్యూసెన్సు.

268. ఏదేని కార్యమును చేయుటవలన లేక శాసనానుసారముగా చేయవలసిన దానిని చేయకుండుటవలన ప్రజలకు గాని, సమీపములో నివసించుచుండు, లేక ఆస్తిని ఆక్రమించియుండు జనులకు గాని ఉమ్మడిగా ఏదేని హానిని, అపాయమును లేక చికాకును కలుగజేయునట్టి, లేక ఏదేని సార్వజనిక హక్కును వినియోగించుకొను అవసరముగల వ్యక్తులకు హానిని, ఆటంకమును, అపాయమును లేక చికాకును తప్పక కలిగించునట్టి వ్యక్తి పబ్లికు న్యూసెన్సును కలిగించిన వాడగును.

ఉమ్మడి న్యూసెన్సును, ఏదేనొక సౌకర్యము లేక అనుకూల్యము. దాని వలన కలుగునను ఆధారముపై, మన్నించరాదు.

ప్రాణాపాయకరమగు పాంక్రామిక రోగమును వ్యాపింప జేయగల నిర్లక్ష్యపు కార్యము.

269. ప్రాణాపాయకరమగు ఏదేని సాంక్రామిక రోగమును వ్యాపింప జేయగలదియు, ఆట్లు వ్యాపింపజేయగలదని తనకు తెలిసినట్టి లేక విశ్వసించుటకు కారణమున్నట్టిదియు అగు ఏదేని కార్యమును శాసన విరుద్ధముగా గాని, నిర్లక్ష్యముగా గాని చేయు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రాణాపాయకరమగు పాంక్రామిక రోగమును వ్యాపింప జేయ గల కార్యమును దుర్బుద్ధి తో చేయుట.

270. ప్రాణాపాయకరమగు ఏదేని సాంక్రామిక రోగమును వ్యాపింప జేయగలదియు, ఆట్ల వ్యాపింప జేయగలదని తనకు తెలిసినట్టి లేక విశ్వసించుటకు కారణమున్నట్టిదియు అగు ఏదేని కార్యమును దుర్భుద్ధి తో చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటి తోగాని శిక్షింపబడుదురు.

క్వారం టైను నియమమును పాటించకుండుట.

271. ఏదేని జలయానమును క్వారం టైను స్థితిలో ఉంచుట కొరకు గాని క్వారం టైను స్థితిలో ఉన్న జలయానములకు ఒడ్డున ఉన్న వారితో లేక ఇతర జలయానములతో రాకపోకలను క్రమబద్ధము చేయు కొరకు గాని, ఏ స్థలములో సాంక్రామిక రోగము వ్యాపించి యుండునో ఆ స్థలమునకు ఇతర స్థలములకు మధ్య రాకపోకలను క్రమబద్ధము చేయుట కొరకు గాని, ప్రభుత్వము చే చేయబడి ప్రఖ్యానింపబడిన ఏదేని నియమమును ఎరిగియుండియు పాటించకుండు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానా తో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

విక్రయమునకై ఉద్దేశింపబడిన ఆహారమును లేక పానీయమును కర్తీ చేయుట.

272. ఏదేని ఆహార లేక పానీయ వస్తువును విక్రయించు ఉద్దేశముతో గాని, ఆది ఆహార లేక పానీయ వస్తువుగా విక్రయింపబడగలదని తెలిసియుండిగాని, అట్టి ఆహార లేక పానీయ వస్తువును ఆహారముగా లేక పానీయముగా హానికరమగునట్లు చేయుటకు గాను కల్తీ చేయు వారెవరైనను,ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

హానికరమగు ఆహారమును లేక పానీయమును విక్రయించుట.

273. హానికరమైనదిగా చేయబడినట్టి, లేక హానికరముగా అయినట్టి, లేక ఆహారముగగాని పానీయముగా గాని ఉపయోగించుటకు పనికిరాని స్థితిలో ఉన్నట్టి ఏదేని వస్తువును, ఆహారముగా గాని, పానీయముగా గాని ఉపయోగించుటకు అది హానికరమై నదని ఎరిగియుండియు, లేక అట్లని విశ్వసించుటకు కారణముండియు, ఆహారముగా లేక పానీయముగా ఆ వస్తువును విక్రయించు, విక్రయింపజూపు, లేక విక్రయమునకై పెట్టు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానా తో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఓషధుల కల్తీ.

274. ఏదేని ఓషధిని, లేక ఔషధమును, అది కల్తీ చేయబడని దానివలె ఏదేని వైద్యము నిమిత్తము విక్రయింపబడవలెనను, లేక అట్లు ఉపయోగింపబడవలెనను ఉద్దేశము తో గాని, ఆట్లు విక్రయింపబడగలదని యైనను, ఉపయోగింపబడగలదని యెనను ఎరిగియుండి గాని, అట్టి ఓషధి లేక ఔషధము యొక్క శక్తిని తక్కువ చేయునట్టి, లేక దాని గుణమును మార్చునట్టి లేక దానిని హానికర మగునదిగ చేయు నట్టి రీతిలో దానిని కల్తీ చేయు వారెవరైనను, ఆరు మాసముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జుర్మానా తో గాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.