పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5


“ కపటముతో 25. కపటమునకు గురి చేయు ఉద్దేశ్యముతో ఒక వ్యక్తి ఏ పనినైనను చేసినచో అతడు ఆ పనిని కపటముతో చేసినట్లు చెప్పబడును, అన్యధా అట్లు చెప్పబడదు.

"విశ్వసించుటకు కారణము"

26. ఒక వ్యక్తికి దేనినైనను విశ్వసించుటకు తగినంత హేతువు ఉన్నచో అతనికి దానిని “విశ్వసించుటకు కారణము" ఉన్నట్లు చెప్పబడును, అన్యథా అట్లు చెప్పబడదు.

భార్య, గుమాస్తా లేక సేవకుని స్వాధీనము లోగల ఆస్తి.

27. ఒక వ్యక్తి తరఫున అతని భార్య, గుమాస్తా లేక సేవకుని స్వాధీనములో ఆస్తి ఉన్నపుడు, ఈ స్మృతి భావములో ఆ ఆస్తి అట్టి వ్యక్తి యొక్క స్వాధీనములో ఉన్నట్లు అగును.

విశదీకరణము :- తాత్కాలికముగానైనను ఒక ప్రత్యేక సందర్భముననైనను గుమాస్తాగా లేక సేవకుడుగా నియోజితుడైన వ్యక్తి ఈ పరిచ్ఛేద భావములో గుమాస్తా లేక సేవకుడు అగును.

"నకిలీగాచేయుట "

28. ఒక వస్తువుతో మరొక వస్తువును పోలునట్లు చేసి, అట్టి పోలికవల్ల మోసము చేయవలెనను ఉద్దేశ్యము గల లేక తద్వారా మోసము జరుగవచ్చునని ఎరిగియుండిన వ్యక్తి “నకిలీ" గా చేసినట్లు చెప్పబడును.

విశదీకరణము 1 :-నకిలీగా చేయుటకు ఖచ్చితమైన అనుకరణము ప్రధానము కాదు.

విశదీకరణము 2 :-ఒక వ్యక్తి ఒక వస్తువుతో మరొక వస్తువును పోలునట్లు చేసినపుడు, అట్టి పోలికవల్ల ఏ వ్యక్తి యైనను మోసగింపబడవచ్చునంతగా ఆ పోలిక ఉన్నయెడల, అట్లు ఆ వస్తువుతో మరొక వస్తువును పోలునట్లు చేయు వ్యక్తి అట్టి పోలికవల్ల మోసము చేయుటకు ఉద్దేశించెనని లేక తద్వారా మోసము జరుగవచ్చునని ఎరిగి యుండెనని తద్విరుద్ధముగా రుజువు చేయబడునంతవరకు, పురోభావన చేయవలెను.

"దస్తావేజు"

29. “దస్తావేజు" అను పదము ఏదేని విషయమునకు సాక్ష్యముగా ఉపయోగించుటకై ఉద్దేశింప బడిన లేక ఉపయోగింపదగిన అక్షరముల, అంకెల, గుర్తులద్వారా గాని, వాటిలో ఒకటికన్నా ఎక్కువ పద్ధతుల ద్వారాగాని ఏ పదారము పై నైనను వ్యక్తము చేయబడినట్టి లేక వివరింపబడినట్టి ఏదేని విషయమును తెలుపును.

విశదీకరణము 1 :—ఆ అక్షరములు, అంకెలు లేక గుర్తులు ఏ పద్ధతుల ద్వారా లేక ఏ పదార్థము పై ఏర్పర్చబడినని అనునదిగాని ఆ సాక్ష్యము ఒక న్యాయస్థానమునకై ఉద్దేశించబడినదా లేదా అనునది గాని అందు ఉపయోగించదగినదా కాదా అనునది గాని ముఖ్యాంశము కాదు.

ఉదాహరణములు

ఒక కాంట్రాక్టు నిబంధనలను వ్యక్త పరచుచు ఆ కాంట్రాక్టుకు సాక్ష్యముగా ఉపయోగింపదగు వ్రాత ఒక దస్తావేజు ;

ఒక బ్యాంకరు పై ఈయబడిన చెక్కు ఒక దస్తావేజు;

ముక్త్యారునామా ఒక దస్తావేజు.

సాక్ష్యముగా ఉపయోగించుటకు ఉద్దేశింపబడిన లేక ఉపయోగింపదగిన ఒక మ్యాపు లేక ప్లాను ఒక దస్తావేజు ;

ఆదేశములు లేక నిదేశములు గల వ్రాత ఒక దస్తావేజు ;

విశదీకరణము 2 :-వాణిజ్య సంబంధమైన లేక ఇతరమైన వాడుకను గురించిన విశదీకరణము ప్రకారము దేనిని అక్షరములు, అంకెలు లేక గుర్తులు వ్యక్తము చేయునో, దానిని వాస్తవముగా అట్లు వ్యక్తము చేయక పోయినను ఈ పరిచ్ఛేదపు భాగములో అట్టి అక్షరములు, అంకెలు లేక గుర్తులు దానిని వ్యక్తము చేసినట్లే భావించవలెను.

ఉదాహరణము

తన ఆర్డరు పొందినవారికి చెల్లింపవలసిన ఒక వినిమయపత్రము వెనుకవైపు “ఏ' తన పేరు వ్రాయును. వాణిజ్య సంబంధమైన వాడుక విశదీకరించు ప్రకారము ఆ వినిమయపత్రదారుకు చెల్లింపు చేయవలెనని ఆ పీటీ వ్రాత యొక్క అర్థము. ఆ పీటీ వ్రాత ఒక దస్తావేజు మరియు “వినిమయపత్రదారుకు చెల్లింపుము" అను పదములు గాని అట్టి అర్థమునిచ్చు పదములు గాని ఆ సంతకము పైన వ్రాయబడి యుండిన ఎటో అదే రీతిగా ఆపీటీవ్రాతను అన్వయించవలెను.