పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విశదీకరణము :- ఒక విలువగల ఆసలైన స్టాంపును వేరే విలువగల ఆనలైన స్టాంపుగా కాన్నించునట్లు చేసి నకిలీ దానిని చేయు వ్యక్తి ఈ అపరాధమును చేసినవాడగును.

ప్రభుత్వ స్టాంపును నకిలీగా చేయుటకై ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనము నందుంచుకొనుట.

256. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును నకిలీగా చేయుటకు ఉపయోగింపబడు నిమిత్తమై గాని, ఉపయోగింపబడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండియు, లేక ఆట్ల ని విశ్వసించుటకు కారణముండియు గాని, ఏదేని ఉపకరణమును లేక సామాగ్రిని స్వాధీనమునందుంచుకొను వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతొ శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ప్రభుత్వ స్టాంపును నకిలీగా చేయు ఉపకరణమును తయారుచేయుట లేక విక్రయించుట.

257. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును నకిలీగా చేయుటకుపయోగింపబడు నిమిత్తమై గాని, అట్లు ఉపయోగింపబడుటకు ఉద్దేశింపబడినదని ఎరిగియుండి లేక అట్లని విశ్వసించుటకు కారణముండి గాని, ఏదేని ఉపకరణమును తయారు చేయు లేక తయారు చేయునట్టి ప్రక్రియలో ఏదేని భాగము నిర్వర్తించు, లేక కొనుగోలు చేయు, లేక విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జూర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీ ప్రభుత్వస్టాంపును విక్రయించుట

258. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేసి స్టాంపును పోలిన నకిలీ స్టాంపని తాను ఎరిగియున్నట్టి లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణమున్నట్టి ఏదేని స్టాంపును వికలుంచు లేక విక్రయింపజూపు వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు.

నకిలీ ప్రభుత్వస్టాంపును స్వాధీనమునందుంచుకొనుట

259. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును పోలిన నకిలీ స్టాంపని తాను ఎరిగియున్నట్టి.ఏదేని స్టాంపును, అసలైన స్టాంపుగా ఉపయోగించు, లేక వ్యయనము చేయు ఉద్దేశముతో గాని, అసలైన స్టాంపుగా ఉపయోగింపబడుటకు గాని తన స్వాధీనము నందుంచుకొను వారెవరైనను, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నకిలీదని ఎరిగియుండి ప్రభుత్వ స్టాంపును అసలైన దానివలె ఉపయోగించుట

260.ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును పోలిన నకిలీ స్టాంపని ఎరిగియుండి, దానిని అసలైన స్టాంపుగా ఉపయోగించు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతో ప్రభుత్వ స్టాంపుగల పదార్థముపై వున్న వ్రాతను తుడిచవేయుట లేక దస్తావేజు కొరకై ఉపయోగింపబడిన స్టాంపును దానినుండి తొలగించుట.

261. ప్రభుత్వము రెవెన్యూ కోరకు జారీచేసిన స్టాంపుగల ఏదేని పదార్ధము నుండి కపటముతోగాని, ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతోగాని, ఏ వ్రాత లేక దస్తావేజు కొరకై అట్టి స్టాంపు ఉపయోగింపబడినదో, ఆ వ్రాతను తుడిచివేయు లేక దస్తా వేజు నుండి ఆస్టాంపును తొలగించు వారెవరై నను, ఏదేని వ్రాత లేక దస్తావేజు కొరకు ఉపయోగింప బడిన స్టాంపును వేరొక వ్రాత లేక దస్తా వేజు కొరకు ఉపయోగించుటకై అట్టి వ్రాత లేక దస్తావేజు నుండి ఆ స్టాంపును తొలగించు వారెవరైనను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ముందే ఉపయోగింపబడినదని ఎరిగియున్న ప్రభుత్వ స్టాంపును ఉపయోగించుట.

262. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన స్టాంపును ఆది ముందే ఉపయోగింపబడినదని ఎరిగియు, కపటముతో గాని, ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతో గాని దేని కొరకైనను మరల ఉపయోగించు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడుదురు.

స్టాంపు ఉపయోగింపబడినదని తెలియజేయు గుర్తును తుడిచివేయుట.

263. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన స్టాంపు నుండి అట్టి స్టాంపు ఉపయోగింపబడినదని తెలియజేయుటకు దాని పై వేయబడిన లేక ముద్రింపబడిన ఏదేని గుర్తును, కపటముతో గాని, ప్రభుత్వమునకు నష్టము కలిగించవలెనను ఉద్దేశముతోగాని, తుడిచివేయు లేక తొలగించు వారెవరైనను, అట్టి గుర్తు తుడిచివేయబడినట్టి దని లేక తొలగింపబడినట్టిదని ఎరిగి యుండియు, అట్టి ఏదేని స్టాంపును స్వాధీనమునందుంచుకొను, లేక విక్రయించు, లేక వ్యయనము చేయు వారెవరైనను, ఉపయోగింపబడినదని తాను ఎరిగియున్నట్టి ఏదేని అట్టి స్టాంపును విక్రయించు లేక వ్యయనము చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి, ఈ రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.