పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఒక నాణెము వేరే రకపు నాణెముగా చెలామణి కావలెనను ఉద్దేశముతో దాని రూపమును మార్చుట.

248. ఏదైనా నాణేము వేరే, నాణెముగా చెలామణి కావలెనను ఉద్దేశముతో దాని రూపమును మార్చునట్టుగా ఆ నాణెము పై ఏదైనను చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒకరకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

భారతీయ నాణెము వేరేరకమునకు చెందిన నాణెముగ చెలామణి కావలెనను ఉద్దేశముతో దాని రూపమును మార్చుట.

249. ఏదేని భారతీయ నాణేము వేరే రకమునకు చెందిన నాణెముగా చెలామణి కావలెనను ఉద్దేశముతో, దాని రూపమును మార్చునట్లుగా ఆ నాణెము పై ఏదైనను చేయు వారెవరైనను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మార్చబడినదని ఎరిగియుండి స్వాధీనము నందుంచుకొన్నట్టి నాణెమును అందజేయుట

250. 246వ లేక 248వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరిగినదో ఆ నాణెమును స్వాధీనము నందుంచుకొని, అట్టి నాణెమునకు సంబంధించి అట్టి అపరాధము జరిగినదని తన స్వాధీనములోనికి ఆ నాణెము వచ్చినపుడు ఎరిగియుండి, కపటముతోనైనను, కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశముతోనై నను ఇతర వ్యక్తి కి ఎవరికైనను అట్టి నాణెమును అందజేయు, లేక ఇతర వ్యక్తి నెవరినై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

మార్చిబడినదని ఎరిగియుండి స్వాధీనము నందుంచుకొన్నట్టి భారతీయ నాణెమును అందజేయుట.

251. 247వ లేక 249వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరిగినదో ఆ నాణెమును స్వాధీనము నందుంచుకొని, అట్టి నాణెమునకు సంబంధించి అట్టి అపరాధము జరిగినదని తన స్వాధీనము లోనికి ఆ నాణెము వచ్చినప్పుడు ఎరిగియుండి, కపటముతోనైనను, కపటమునకు గురిచేయ వచ్చునను ఉద్దేశము తోనై నను ఇతర వ్యక్తి కెవరికై నను అట్టి నాణెమును అందజేయు, లేక ఇతర వ్యక్తి నెవరినై నను దానిని పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

నాణెము మార్పుచేయబడినదని తన స్వాధీనమునకు వచ్చినప్పుడు ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనము నందుంచుకొనుట.

252. 246వ లేక 248వ పరిచ్చేదములో నిర్వచింపబడిన అపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరుపబడినదో ఆ నాణెమును దానికి సంబంధించి అట్టి అపరాధము జరిగినదని తన స్వాధీనమునకు వచ్చినపుడు ఎరిగి యుండియు), కపటముతోనై నను కపటమునకు గురిచేయ వచ్చునసు ఉద్దేశముతోనైనను, అట్టి నాణెముసు స్వాధీనము నందుంచుకొన్న వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

భారతీయ నాణెము మార్పు చేయబడినదని తన స్వాధీనమునకువచ్చినపుడు, ఎరిగియున్నట్టి వ్యక్తి దానిని స్వాధీనము నందుంచుకొనుట.

253. 247వ లేక 249వ పరిచ్ఛేదములో నిర్వచింపబడిన ఆపరాధము ఏ నాణెమునకు సంబంధించి జరుపబడినదో ఆ నాణెములు దానికి సంబంధించి అట్టి ఆపరాధము జరిగినదని తన స్వాధీనమునకు వచ్చినపుడు ఎరిగి యుండియు, కపటముతోనైనను, కపటమునకు గురిచేయవచ్చునను ఉద్దేశముతోనై నను, అట్టి నాణెమును, స్వాధీనమునందుంచుకొన్న వారెవరైనను, ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

ప్రప్రథమముగా తన స్వాధీనమునకు వచ్చినప్పుడు మార్పుచేయుబడినదని ఆందచేయువానికి తెలియక నాణెమును అసలైన నాణెముగా అందజేయుట.

254. పరిచ్ఛేదము 246, 247, 248 లేక 249 లో పేర్కొనబడినట్టి దేదైనను ఏదైనా నాణెమునకు సంబంధించి చేయబడినదని తాను ఎరిగియు, అట్లు చేయబడినదని అది. తన స్వాధీనమునకు వచ్చినపుడే ఎరుగక ఆ నాణెమును ఏ ఇతర వ్యక్తి కై నను అసలైన నాణెముగా లేక అది ఉన్న రకపుదిగాగాక వేరే రకపు నాణెముగా అందజేయు లేక ఆసలైన నాణెముగానో, అది ఉన్న రకపుదిగా గాక వేరే రకపు నాణెముగానో ఏ వ్యక్తి యై నను పుచ్చుకొనునట్లు చేయుటకు ప్రయత్నించు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో, లేక మార్పుచేయబడిన నాణెము ఏ రకపు నాణెముగా చెలామణి చేయబడినదో లేక చెలామణి అగుటకు ప్రయత్నింప బడినదో ఆ విలువకు పది రెట్ల దాక ఉండగల మొత్తమునకు జుర్మానాతో శిక్షింపబడుదురు.

ప్రభుత్వ స్టాంపులను నకిలీగా చేయుట.

255. ప్రభుత్వము రెవెన్యూ కొరకు జారీచేసిన ఏదేని స్టాంపును నకిలీగా చేయు లేక నకిలీగా చేయు ప్రక్రియలో ఏదేని భాగమును నిర్వర్తించు వారెవరైనను యావజీవ కారావాసముతోగాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.