పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48


హాని కలిగించు ఉద్దేశముతో తప్పుడు అపరాధారోపణ.

211. ఏ వ్యక్తి కై నను హాని కలిగించు ఉద్దేశముతో, ఆ వ్యక్తిపై క్రిమినలు చర్యను ప్రారంభించుటకు గాని ప్రారంభించునట్లు చేయుటకుగాని, అపరాధము చేసినాడని ఆరోపణ చేయుటకు గాని న్యాయమైన లేక శాసనసమ్మతమైన ఆధారమేదియు లేదని ఎరిగి యుండియు, ఆ వ్యక్తి పై అట్టి ఏదేని చర్యను ప్రారంభించు, లేక ప్రారంభించునట్లు చేయు, లేక అట్టి తప్పుడు ఆరోపణము చేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానాతోనైనను, ఈ రెండింటితోనై నను శిక్షింపబడుదురు;

మరియు, మరణదండనతోగాని, యావజ్జీవ కారావాసముతోగాని, ఏడు సంవత్సరములు లేక అంత కెక్కువ కాలము దాక కారావాసముతో గాని, శిక్షింపదగు అపరాధమును గూర్చిన తప్పుడు ఆరోపణపై అట్టి క్రిమినలు చర్య తేబడినచో ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మా నాకు కూడ పాత్రులగుదురు.

అపరాధికి ఆశ్రయ మిచ్చుట.

212, అపరాధము చేయబడినపుడెల్లను, అపరాధియని తనకు తెలిసియున్నట్టి లేక అట్లు విశ్వసించుటకు కారణమున్నట్టి వ్యక్తికి శాసనవిహితమైన శిక్ష పడకుండ కాపాడు ఉద్దేశముతో, ఆ వ్యక్తికి ఆశ్రయమిచ్చు లేక అతనిని దాచు వారెవరైనను,

అపరాధము మరణశిక్ష విధింప దగిన దైనచో.

ఆ అపరాధము మరణదండనతో శిక్షింపదగినదైనచో, ఐదు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

యావజ్జీవ కారావాసముతో లేక కారావాసముతో శిక్షింపదగినదైనచో

ఆ అపరాధము, యావజ్జీవ కారావాసముతో నైనను, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో నైనను శిక్షింపదగినదైనచో, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;

మరియు ఆ ఆపరాధము పది సంవత్సరముల వరకు కాక ఒక సంవత్సరముదాక ఉండగల కారావాసముతో శిక్షింపదగినదైనచో ఆ అపరాధమునకు నిబంధనానుసారముగల దీర్ఘ తమ కారావాస కాలావధిలో నాలుగవ భాగము మేరకు ఉండగల కాలావధికి, ఆ అపరాధమునకు నిబంధనానుసారము ఏ రకపు కారావాసముగలదో ఆ రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు;

ఈ పరిచ్చేదములో 'అపరాధము' అను పదపరిధియందు ఏకార్యము భారతదేశములో చేయబడియుండినచో ఈ క్రింది పరిచ్ఛేదములలో, అనగా 302, 304, 382, 392, 393, 394, 395, 396, 397, 398, 399, 402, 435, 436, 449, 450, 457, 458, 459 మరియు 460 లలో, దేని క్రిందనైనను శిక్షింపదగియుండెడిదో అట్టి ఏ కార్యమైనను భారతదేశము వెలుపల ఏ స్థలము నందు చేయబడినదైనను, చేరి యుండును, మరియు నిందితవ్యక్తి భారతదేశములో ఆ కార్యమును చేసియుండిన యెట్లో అట్లే ఈ పరిచ్ఛేదము నిమిత్తము అట్టి ప్రతికార్యము శిక్షింపదగినదని భావించవలెను;

మినహాయింపు :-- అపరాధికి భర్త, లేక భార్య ఆశ్రయమిచ్చినట్టి లేక అపరాధిని భర్త, లేక భార్య దాచినట్టి ఏ సందర్భమున కైనను ఈ నిబంధన విస్తరించదు;

ఉదాహరణము

'బీ' బందిపోటు చేసినవాడని 'ఏ' ఎరిగియుండియు, అతనికి శాసనవిహిత శిక్ష పడకుండ కాపాడుటకై తెలిసియే, 'బి'ని 'ఏ' దాచి పెట్టును. ఇచట 'బీ' యావజ్జీవ కారావాస శిక్షా పాత్రుడై యున్నందున, 'ఏ' మూడు సంవత్సరములకు మించని కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసమునకు పాత్రుడగును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

శిక్ష పడకుండా అపరాధిని కాపాడుటకై పారితోషికము మొదలగు వాటిని తీసికొనుట.

213. అపరాధమును మరుగుపరుచుటకై, లేక ఏ వ్యక్తి కైనను, ఏదేని అపరాధమునకుండు శాసనవిహిత శిక్ష పడకుండా, అతనిని కాపాడుటకై , లేక ఏ వ్యక్తి కైనను శాసన విహిత శిక్ష పడే నిమిత్తము అతనిపై తాను తీసికొనవలసిన చర్య తీసికొనకుండుటకై ప్రతిఫలముగ తాను, తన కొరకు గాని ఎవరేని ఇతర వ్యక్తి కొరకుగాని, ఏదేని పారితోషికమునై నను, తనకుగాని ఎవరేని ఇతర వ్యక్తి కిగాని పున:ప్రాప్తమగు ఏదేని ఆస్తి నైనను స్వీకరించు, పొందుటకు ప్రయత్నించు, లేక స్వీకరించుటకు అంగీకరించు వారెవరైనను,

అపరాధము మరణ శిక్ష విధింప దగినదైనచో

ఆ అపరాధము, మరణదండనతో శిక్షింపదగినదైనచో, ఏడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు;