పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

47

దావా లేక అభియోగములో, కార్యము లేక చర్య నిమిత్తమై తప్పుడు ప్రతి రూపణము.

205. మరొకరిగ తప్పుడు ప్రతి రూపణము చేసి, అట్లు ఆపాదించుకున్న రూపములో, ఏదేని దావాలోగాని, అపరాధిక అభియోగములో గాని దేనినై నను ఒప్పుకొను, చెప్పు, లేక వాదించక తీర్పును స్వీకరించు, లేక ఏదేని ఆదేశికను జారీ చేయించు, లేక జామీనునైనను జమానతునైనను ఇచ్చు, లేక ఏదేని ఇతర కార్యమును చేయు వారెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జర్మానాతోనైనను ఈ రెండింటితో నైనను శిక్షింపబడుదురు.

సమపహరింప బడినది గాగాని, అమలు చర్యలో గాని అభి గ్రహించకుండ చేయుటకై ఆస్తిని కపటముతో తొలగించుట లేక దాచుట.

206. న్యాయస్థానముచే గాని, ఇతర సమర్థ ప్రాధికారముచేగాని, ఒసగబడినట్టి, లేక ఒసగబడగలదని తనకు తెలిసియున్నట్టి దండనోత్తరువు క్రింద ఏదేని ఆస్తినైనను అందలి ఏదేని హితమునైనను సమపహరణముగ లేక జుర్మానా తీరుదలకై తీసికొనబడకుండ గాని, సివిలు దావాలో న్యాయస్థానముచే చేయబడినట్టి లేక చేయబడగలదని తనకు తెలిసి యున్నట్టి డిక్రీని లేక ఉత్తరువును అమలు జరుపుటకై తీసికొనబడకుండగాని చేయు ఉద్దేశముతో, ఆ ఆస్తిని లేక అందలి హితమును కపటపూర్వకముగ తొలగించు, దాచు, ఏ వ్యక్తి కైనను బదిలీచేయు లేక అప్పగించువారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానాతోనై నను, లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

సమపహరింపబడినదిగా గాని అమలు చర్యలోగాని అభిగ్రహించకుండ చేయుటకై ఆస్తిని కపటముతో క్లెయిము చేయుట.

207. న్యాయస్థానముచేగాని, ఇతర సమర్థ ప్రాధికారముచేగాని ఒసగబడినట్టి, లేక ఒసగబడగలదని తనకు తెలిసియున్నట్టి దండనోత్తరువు క్రింద ఏదేని ఆస్తినైనను, అందలి ఏదేని హితమునైనను సమపహరణముగ లేక జుర్మానా తీరుదలకై తీసికొనబడకుండగాని, సివిలు దావాలో న్యాయస్థానముచే చేయబడినట్టి లేక చేయబడగలదని తనకు తెలిసియున్నట్టి డిక్రీని లేక ఉత్తరువును అమలు జరుపుటకై తీసికొనబడకుండగాని, చేయు ఉద్దేశముతో ఆ ఆస్తి పై లేక అందలి హితముపై తనకు ఎట్టి హక్కుగాని, న్యాయసమ్మతమైన క్లెయిముగాని లేదని ఎరిగియుండియు ఆ ఆస్తిని లేక అందలి హితమును కపటపూర్వకముగ స్వీకరించు, పుచ్చుకొను, లేక క్లెయిముచేయు, లేక ఆ ఆస్తి యందు ఏదేని హక్కుకు లేక ఏదేని హితమునకు సంబంధించి ఏదేని మోసముచేయు వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసములోనైనను, జుర్మానాతోనై నను లేక ఈ రెండింటితోనైనను శిక్షింపబడుదురు.

బాకీలేని సొమ్ముకై కపటముతో డిక్రీని పాస్ కానిచ్చుట.

208. ఎవరైన వ్యక్తి తెచ్చిన దావాలో అట్టి వ్యక్తి కి బాకీలేని సొమ్ముకైనను, బాకీ ఉన్న దానికంటే ఎక్కువ సొమ్ము కైనను, అట్టి వ్యక్తికి హక్కులేని ఏదేని ఆస్తి కైనను, ఆ ఆస్తి యందలి ఏదేని హితమునకైనను, తనపై డిక్రీని గాని ఉత్తరువును గాని కపటముగా పాస్ చేయించుకొను లేక పాస్ కానిచ్చు, లేక డిక్రీ సొమ్ముగాని, ఉత్తరువు సొమ్ము గాని తీరిపోయిన పిమ్మట లేక అప్పటికే తీరిపోయిన దాని దేని విషయములోనైనను తనపై డిక్రీనిగాని, ఉత్తరువునుగాని కపటముగా అమలు జరిపించుకొను లేక అమలుజరుగనిచ్చు వారెవరైనను రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారా వాసముతోగాని, జూర్మానాతోగాని, లేక ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

ఉదాహరణము

'జడ్' పై 'ఏ' దావా వేయును. తన పై 'ఏ' డిక్రీ పొందగలడని 'జడ్' కు తెలిసియుండి అతని ఆస్తి 'ఏ' యొక్క డిక్రీ క్రింద విక్రయింపబడినచో వచ్చే విక్రయపు రాబడిలో, 'బి' యనునతడు తనకొరకై నను 'జడ్'యొక్క మేలు కొరకై నను, వాటా పంచుకొను నిమిత్తము 'జడ్' పై న్యాయమైన ఎట్టి క్లెయిము 'బి' కి లేక పోయినను 'బీ' చేసిన దావాలో 'ఏ' యొక్క దావా మొత్తము కన్న ఎక్కువ మొత్తమునకు 'జడ్' కపటపూర్వకముగా తనకు వ్యతిరేకముగా తీర్పు కానిచ్చును. 'జడ్' ఈ పరిచ్ఛేదము క్రింద అపరాధమును చేసినవాడగును.

న్యాయస్థానములో నిజాయితీ లేకుండ తప్పుడు క్లెయిమును చేయుట.

209. న్యాయస్థానములో కపటముతో గాని, నిజాయితీ లేకుండగాని, ఏ వ్యక్తి కైనను హానిని లేక చీకాకును కలిగించు ఉద్దేశముతో గాని, తప్పుడుదని తాను ఎరిగి యున్నట్టి ఏదేని క్లెయిమును చేయు వారెవరైనను, రెండు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

బాకీలేని సొమ్ముకై కపటముతో డిక్రీని పొందుట.

210. ఎవరేని వ్యక్తి పై అతడు బాకీ లేని సొమ్ముకైనను, బాకీ ఉన్న దానికంటే ఎక్కువ సామ్ముకైనను, తనకు హక్కు లేని ఏదేని ఆస్తికైనను, ఆ ఆస్తి యందలి ఏదేని హితమునకైనను డిక్రీని గాని ఉత్తరువునుగాని కపటముతో పొందునట్టి, లేక డిక్రీ సొమ్ముగాని ఉత్తరువు సొమ్ము గాని తీరిపోయిన పిమ్మట, లేక అప్పటికే తీరిపోయినదాని దేని విషయములో నైనను, ఏ వ్యక్తి పై నైనను డిక్రీని గాని, ఉత్తరువును గాని కపటముగా అమలు జరిపించునట్టి లేక కపటముతో ఏదేని అట్టి కార్యమును తన పేరిట చేయనిచ్చు లేక చేయుటకు అనుమతించునట్టి వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోనైనను, జుర్మానాతోనైనను, ఈ రెండింటితో నైనను శిక్షింపబడుదురు.