పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

38


ఎన్నికకు సంబంధించి చేసిన శాసన విరుద్ధ చెల్లింపులు.

171- హెచ్. అభ్యర్థి యొక్క వ్రాతమూలకనైన సాధారణ లేక ప్రత్యేక ప్రాధికారము లేకుండ, అట్టి అభ్యర్థి ఎన్నిక అవకాశములను మెరుగు పరుచుటకు లేక అతడు ఎన్నిక ఆగునట్లు చేయుటకు ఏదేని బహిరంగ సభను జరుపుటకుగాని, ఏదేని ప్రసార ప్రకటనను, సర్క్యులరును లేక ప్రచురణమును గూర్చిగాని, ఏదైనా విధముగ గాని, ఖర్చు చేయు లేక ఖర్చుచేయుటకు ప్రాధికారము నొసగు వారెవరైనను, అయిదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో శిక్షింపబడుదురు :

అయితే, ఏ వ్యక్తియైనను ప్రాధికారము లేకుండ పది రూపాయల మొత్తమునకు మించని అట్టి ఏవేని ఖర్చులు చేసి ఆట్టి ఖర్చు అయిన తేదీ నుండి పది దినముల లోపల అభ్యర్థి యొక్క ఆమోదమును పొందిన, అతడు ఆట్టి ఖర్చు అభ్యర్థి యొక్క ప్రాధికారముతో చేసినట్లు భావించవలెను.

ఎన్నిక ఖర్చులు లెక్కలను వ్రాసి, ఉంచకుండుట.

171-ఐ. ఎన్నిక యందు చేసిన లేక దానికి సంబంధించి చేసిన ఖర్చుల లెక్కలను తత్సమయమున అమలులో నుండు ఏదేని శాసనమునుబట్టి గాని, శాసనమువలె అమలు కలిగియుండు. ఏదేని నియమమునుబట్టి గాని, వ్రాసి ఉంచవలసియుండియు, అట్టి లెక్కలను వ్రాసియుంచని వారెవరైనను, అయిదు వందల రూపాయలదాక ఉండగల జర్మానాతో శిక్షింపబడుదురు.

అధ్యాయము - 10

పబ్లికు సేవకుల శాసన సమ్మత ప్రాధికారమును ధిక్కరించుటను గురించి

సమను తామీలు కాకుండుటకు లేక ఇతర చర్య జరుగకుండుటకు గాను పరారి అగుట.

172. పబ్లికు సేవకుడుగా సమనును, నోటీసును, లేక ఉత్తరువును జారీచేయుటకు శాసనరీత్యా సమర్ధుడై నట్టి ఎవరేని పబ్లికు సేవకుని నుండి వచ్చినట్టి సమనును, నోటీసును లేక ఉత్తరువును తనకు తామీలు కాకుండ తప్పించు కొనుటకు గాను పరారీ అగువారెవరైనను, ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, ఐదువందల రూపాయలదాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు., లేక ఆ సమనుగాని నోటీసుగాని, ఉత్తరువుగాని, న్యాయస్థానము నందు స్వయముగానై నను. ఏజెంటు ద్వారానైనను హాజరు కావలెనను నట్టిది, లేక దస్తావేజును దాఖలు చేయవలెనను నట్టిది అయినచో, ఆరుమాసములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఒక వేయి రూపాయలదాక ఉండగల జూర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

సమను తామీలు అగుటను లేక ఇతర చర్య జరుగుటను నివారించుట లేక వాటి ప్రచురణమును నివారించుట.

173. పబ్లికు సేవకుడుగా సమనును, నోటీసును లేక ఉత్తరువును జారీచేయుటకు శాసనరీత్యా సమర్థుడై నట్టి ఎవరేని పబ్లికు సేవకుని నుండి వచ్చినట్టి ఏదేని సమనును, నోటీసును లేక ఉత్తరువును తనకుగాని, ఎవరేని ఇతర వ్యక్తి కిగాని తామీలు అగుటను ఏ రీతిగానైనను ఉద్దేశపూర్వకముగా నివారించు,

లేక, "ఏదేని ఆట్టి సమనును, నోటీసును, లేక ఉత్తరువును ఏ స్థలమునందై నను శాసనసమ్మతముగా అతికించుటను ఉద్దేశపూర్వకముగా నివారించు,

లేక, ఏదేని ఆట్టి సమను, నోటీసు, లేక ఉత్తరువును శాసనసమ్మతముగా అతికించినట్టి ఏ స్థలమునుండి యైనను దానిని ఉద్దేశపూర్వకముగా తొలగించు,

లేక, అధి ప్రఖ్యానము చేయవలసినదని ఆదేశించుటకు పబ్లికు సేవకుడుగా శాసనరీత్యా సమర్థుడైనట్టి ఎవరేని పబ్లికు సేవకుని ప్రాధికారము క్రింది అట్టి అధి ప్రఖ్యానమును శాసనసమ్మతముగా చేయుటను ఉద్దేశపూర్వకముగా నివారించు,

వారెవరైనను ఒక మాసముదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతో గాని, ఐదు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు;

లేక, ఆ సమనుగాని, నోటీసుగాని, ఉత్తరువుగాని, అధి ప్రఖ్యానము గాని, న్యాయస్థానమునందు స్వయముగా నైనను, ఏజెంటు ద్వారానైనను హాజరు కావలెననునట్టిది, లేక దస్తావేజును దాఖలు చేయవలెననునట్టిది అయినచో, ఆరుమాసములదాక ఉండగల కాలావధికి కారావాసముతోగాని, వేయి రూపాయలదాక ఉండగల జుర్మానాలో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.