పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36


పబ్లికు సేవకుడు హాని కలిగించు ఉద్దేశముతో తప్పులతో కూడియున్న దస్తావేజును రూపొందించుట.

167. పబ్లికు సేవకుడై యుండి అట్టి పబ్లికు సేవకుడుగా ఏదేని దస్తావేజును తయారు చేయవలసిన లేక అనుసరించ వలసిన బాధ్యతను కలిగియుండి, ఆ దస్తా వేజును, తప్పులతో కూడియుండినదని తనకు తెలిసియున్న లేక అట్టి దని తాను విశ్వసించుచున్న రీతిలో రూపొందించుటద్వారాగాని, అనువదించుట ద్వారాగాని ఏ వ్యక్తికై నను హాని కలిగించు ఉద్దేశముతో లేక తాను హాని కలిగించగలనని ఎరిగియుండి, అట్లు రూపొందించు లేక అనువదించు నతడెవరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పబ్లికు సేవకుడు శాసన విరుద్ధముగ వ్యాపారము చేయుట,

168. పబ్లికు సేవకుడై యుండి, వ్యాపారము చేయకుండుటకు అట్టి పబ్లికు సేవకుడుగా శాసనరీత్యా బద్దుడై యుండి, వ్యాపారము చేయునతడెవరైనను ఒక సంవత్సరముదాక ఉండగల కాలానధికి సాధారణ కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడును.

పల్లెకు సేవకుడు శాసన విరుద్దముగ ఆస్తిని కొనుట లేక ఆస్తి కొరకు వేలము పొడుట.

169. పబ్లికు సేవకుడై యుండి, ఒకానొక ఆస్తిని కొనకుండుటకు లేక ఆ ఆస్తికై వేలము పాడకుండుటకు అట్టి పబ్లికు సేవకుడుగా శాససరీత్యా బద్దుడై యుండి, ఆ ఆస్తిని తన పేరిటగాని మరొకరి పేరిట గాని, సంయుక్తముగ గాని, ఇతరులతో కలిసి వాటాలలోగాని కొనిన, లేక వేలముపాడిన అతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి సాధారణ కారావాసముతోగాని, జర్మానాతోగాని, ఈ రెండింటితోగాని, శిక్షింపబడును, మరియు ఆ ఆస్తి కొనబడినచో, అధిహరింపబడును.

పబ్లికు సేవకుని ప్రతి రూపణము.

170. ఏదేని ప్రత్యేకమైన పబ్లికు సేవక పదవి తనకు లేదని తెలిసియుండియు, ఆట్టి పదవి తనకు ఉన్నట్లు నటించి లేక అట్టి పదవి యున్న ఎవరేని ఇతర వ్యక్తిగా ప్రతిరూపణము చేసి, ఆపాదించుకొనిన ఆ రూపములో,అట్టి పదవి ప్రాపకముతో ఏదేని కార్యమును చేయు, లేక చేయుటకు ప్రయత్నించు నతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలానధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

కపటోద్దేశముతో పబ్లికు సేవకుడు ఉపయోగించెడి దుస్తులను ధరించుట, లేక టోకెనును వెంట ఉంచుకొనుట.

171. ఒక నిర్దిష్టమైన పబ్లికు సేవక వర్గమునకు చెందిన వాడు కాకున్నను తాను ఆ పబ్లికు సేవక వర్గమునకు చెందియున్నట్లు విశ్వసింపబడవలెనను ఉద్దేశ్యముతో, లేక అట్లు విశ్వసింపబడవచ్చునని ఎరిగి యుండి, ఆ పబ్లికు సేవక వర్గము ఉపయోగించెడి ఏవేని దుస్తులను పోలియున్న దుస్తులను ధరించు లేక వారు ఉపయోగించెడి ఏదేని టోకెనును పోలియున్న టోకెనును తనవద్ద పెట్టుకొను నతడెవరైనను, మూడు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, రెండు వందల రూపాయల దాక ఉండగల జుర్మానాతో గాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

అధ్యాయము--9-ఏ

ఎన్నికలకు సంబంధించిన అపరాధములను గురించి

"అభ్యర్థి", " ఎన్నిక హక్కు" నిర్వచనములు

171-ఏ. ఈ అధ్యాయము నిమిత్తము, ---

(ఎ) “అభ్యర్థి " అనగా ఏ ఎన్నికయందై నను అభ్యర్థిగా నామనిర్దేశము చేయబడినట్టి వ్యక్తి అని అర్థము, మరియు ఆ పద పరిధియందు, ఒక ఎన్నిక జరుప తలపెట్ట బడినప్పుడు ఆ ఎన్నికలో తాను కాబోవు అభ్యర్థినని ప్రకటించుకొనిన వ్యక్తి కూడ, ఆ తరువాత అతడు అట్టి ఎన్నికయందు అభ్యర్థిగా నామనిర్దేశము చేయబడినట్లయితే చేరియుండును.

(బి)“ఎన్నిక హక్కు అనగా ఎన్నికయందు అభ్యర్థి గా నిలబడుటకు లేక నిలబడకుండుటకు లేక అభ్యర్థిత్వము నుండి తన పేరును ఉపసంహరించుకొనుటకు లేక వోటు వేయుటకు లేక వోటు వేయకుండుటకు ఒక వ్యక్తికి గల హక్కు అని అర్థము.

"లంచగొండితనము"

171-బీ. (1) ఎవరైనను -

(i) ఏ వ్యక్తి కైనను, అతనినిగాని ఎవరేని ఇతర వ్యక్తి నిగాని ఏదేని ఎన్నిక హక్కును వినియోగించుటకు ప్రేరితుని చేయు లక్షముతో, లేక ఏదేని అట్టి హక్కును వినియోగించినందుకు ఆతనికి గాని ఎవరేని ఇతర వ్యక్తికి గాని బహుమానమొసగు లక్ష్యముతో, పారితోషికము ఇచ్చినయెడల, లేక

(ii) అట్టి ఏదేని హక్కును వినియోగించుటకు గాని, అట్టి ఏదేని హక్కును వినియోగించుటకై ఎవరేని ఇతర వ్యక్తిని ప్రేరితుని చేయుటకు, లేక ప్రేరితుని చేయుటకై ప్రయత్నించుటకుగాని, బహుమానముగా ఏదేని పారితోషికమును తనకొరకుగాని, ఎవరేని ఇతర వ్యక్తి కొరకుగాని స్వీకరించినయెడల.

వారు లంచగొండితనము అను అపరాధమును చేసిన వారగుదురు.