పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

30


దొమ్మీ,

146. ఏదీని శాసనవిరుద్ధ సమావేశము యొక్క ఉమ్మడి లక్ష్యమును సాధించుటలో అట్టి సమావేశముగాని దానికి చెందిన ఎవరేని వ్యక్తి గాని, బలప్రయోగమునైనను హింసా ప్రయోగమునైనను జరిపినపుడెల్లను అట్టి సమావేశమునకు చెందిన ప్రతి వ్యక్తి దొమ్మీ అను అపరాధమును చేసినవాడగును.

దొమ్మీకి శిక్ష.

147. దొమ్మీ చేసిన వారెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

మారణాయుధములను ధరించి దొమ్మీ చేయుట.

148. ఏదేని మారణాయుధమును ధరించిగాని, దాడి ఆయుధముగా ఉపయోగించినపుడు మరణము కలిగింపజాలు దేనినైనను ధరించిగాని దొమ్మీ చేసినవారెనరైనను, మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.

ఉమ్మడి లక్ష్యమును సాధించుటలో జరిగిన అపరాధమును శాసనవిరుద్ద సమావేశమునకు చెందిన ప్రతివ్యక్తి చేసిన వాడగుట.

149. శాసనవిరుద్ధ సమావేశము యొక్క ఉమ్మడి లక్ష్యమును సాధించుటలో, ఆ సమావేశమునకు చెందిన ఏ వ్యక్తి యైనను ఒక ఆపరాధమును చేసినచో, లేక ఆ లక్ష్య సాధనలో జరుగుట సంభవమని ఆట్టి సమావేశమునకు చెందిన వ్యక్తులు ఎరిగియున్నట్టి అపరాధమును చేసినచో, ఆ ఆపరాధము జరిగినపుడు ఆ సమావేశమునకు చెందిన ప్రతి వ్యక్తియు ఆ ఆపరాధమునుచేసిన వాడగును.

శాసన విరుద్ద సమావేశములో చేరుటకు వ్యక్తులను కిరాయికి తెచ్చుట లేక కిరాయికి తెచ్చుటకు మౌనానుకూలతను చూపుట,

150. ఏదేని శాసన విరుద్ధ సమావేశములో చేర్చుటకుగాని, అట్టి సమావేశమునకు చెందునట్లు చేయుటకుగాని వ్యక్తినైనను కిరాయికి తెచ్చు, లేక పనిలో కుదుర్చుకొను, లేక నియోగించు, లేదా అందుకుగాను ఏ వ్యక్తినై నను కిరాయికి తెచ్చుటను గాని, పనిలో కుదుర్చుటనుగాని, నియోగించుటనుగాని, ప్రోత్సహించు, లేక అందుకు మౌనానుకూలతను జూపు వారెవరైనను అట్టి శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తులుగ శిక్షింపబడుదురు. మరియు అట్టి ఏ వ్యక్తి యైనను అట్టి శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తిగా అట్టి కిరాయికి తేబడుటను, పనిలో కుదుర్చబడుటను, లేక వినియోగింపబడుటను అనుసరించి చేసినట్టి ఏదేని ఆపరాధమునకు, తాము అట్టి శాసనవిరుద్ధ సమావేశమునకు చెందిన వ్యక్తులై యుండినచో, లేక తామే స్వయముగా అట్టి ఆపరాధమును చేసియుండినచో ఎట్లో అదేరీతిగ శిక్షింపబడుదురు.

అయిదుగురు లేక అంతకు ఎక్కువ మంది వ్యక్తుల సమావేశము చెదరి పోవలసినదని ఆజ్ఞాపింపబడిన పిమ్మట, ఎరిగియుండియు అందులో చేరుట లేక దానిని విడువకుండుట,

151. ప్రజాశాంతికి భంగకరము కాగల, అయిదుగురు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులుగల సమావేశము చెదరిపోవలసినదని శాసనసమ్మతముగా అజ్ఞాపింపబడిన పిమ్మట, ఎరిగియుండియు అట్టి సమావేశములో చేరు లేక దానిని వీడక ఉండు వారెవరైనను, ఆరు మాసములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింసబడుదురు.

విశదీకరణము :-- సమావేశము 141వ పరిచ్ఛేద భావములో శాసనవిరుద్ద సమావేశమగుచో, అపరాధి 145వ పరిచ్ఛేదము క్రింద శిక్షింపదగియుండును.

దొమ్మీ మొదలైన వాటిని అణచివేయునపుడు పబ్లికు సేవకుని పై దౌర్జన్యము చేయుట లేక ఆతనిని ఆటంకపరచుట.

152. శాసనవిరుద్ధ సమావేశమును చెదరగొట్టు ప్రయత్నములో, లేక దొమ్మీనిగాని జగడమునుగాని అణచివేయు ప్రయత్నములో పబ్లికు సేవకుడుగా తన కర్తవ్యమును నిర్వహించుచున్న ఎవరేని పబ్లికు సేవకుని పై దౌర్జన్యముచేయు, లేక దౌర్జన్యము చేయుదునని బెదిరించు, లేక అతనిని ఆటంకపరచు లేక ఆటంక పరచుటకు ప్రయత్నించు, లేక అట్టి పబ్లికు సేవకునిపై ఆపరాధిక బలమును ప్రయోగించు, లేక ప్రయోగింతునని బెదిరించు, లేక ప్రయోగించుటకు ప్రయత్నించు వారెవరైను, మూడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు,

దొమ్మీ జరిగించు ఉద్దేశముతో బుద్ధి పూర్వకముగా ప్రకోపింప జేయుట.

153. శాసనవిరుద్ధమైన పనిని దేనినై నను చేయుటద్వారా దొమ్మీ అపరాధము జరుగవలెనను ఉద్దేశముతో లేక దొమ్మీ ఆపరాధము జరుగుట సంభవమని ఎరిగియుండి, విద్వేష పూర్వకముగ గాని, బుద్ధి పూర్వకముగ గాని, ఏ వ్యక్తినైనను ప్రకోపింపజేయు వారెవరైనను,

డొమ్మీ జరిగినచో,

దొమ్మీ అపరాధము అట్టి ప్రకోపవరిణామముగా జరిగినచో, ఒక సంవత్సరముదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతోగాని, జుర్మానాతో గాని, ఈ రెండింటితోగాని శిక్షింపబడుదురు.

దొమ్మీ జరగనిచో,

దొమ్మీ ఆపరాధము జరగనిచో, ఆరు నెలలదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గానీ ఈ రెండింటితో గాని శిక్షింపబడుదురు.