పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారత శిక్షాస్మృతి

(1860 లోని 45వ చట్టము)

[6వ అక్టోబరు, 1860]

అధ్యాయము-1

అవతారిక

ప్రస్తావన, భారత దేశమునకు సాధారణ శిక్షా స్మృతిని ఏర్పాటు చేయుట ఉపయుక్త మై నందున ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది :--

స్మృతి నామము, మరియు దాని అమలు యొక్క విస్తృతి.

1. ఈ చట్టమును భారత శిక్షాస్మృతి అని పేర్కొనవలెను మరియు ఇది జమ్మూ- కాశ్మీరు రాజ్యము మినహా యావద్భారత దేశమునకు విస్తరించుము.

భారతదేశములో చేయు అపరాధములకు శిక్ష.

2. ప్రతి వ్యక్తియు, ఈ స్మృతి నిబంధనలకు విరుద్ధముగా జరిపి భారత దేశములో దోపియగు ప్రతి కార్యమునకు లేక కార్యలోపమునకు ఈ స్మృతి క్రిందనే శిక్షా పాత్రుడగును; అన్యథా ఆతడు శిక్షాపాత్రుడు కాడు.

భారత దేశము వెలుపల చేయబడియు శాసనమును బట్టి భారతదేశములో విచారణ చేయదగినట్టి అపరాధములకు శిక్ష.

3. భారత దేశము వెలుపల చేసిన అపరాధ విషయమున ఏదేని భారతదేశ శాసనమునుబట్టి వివారణకు గురి కావలసిన ఏ వ్యక్తి పై నైనను, అతడు భారత దేశము వెలుపల చేసిన ఏదేని కార్యమునకు, అట్టి కార్యమును భారత దేశములో చేసియుండిన ఎట్లో ఆదే రీతిగా, ఈ స్మృతి నిబంధనల ననుసరించి చర్య తీసికొనవలెను.

రాజ్యక్షేత్రాతీతమైన అపరాధములకు స్మృతి యొక్క విస్తరింపు.

4. (1) భారతదేశమువకు ఆవల మరియు వెలుపల ఏ స్థలమునందైనను భారతదేశ పౌరుడెవరై నను చేసిన,

(2) భారత దేశములో రిజిస్టరైన ఏదేని నౌక లేక వాయుయానముపై, ఆది ఎచటనున్నను, వ్యక్తి ఎవరైనను చేసిన--

ఏ అపరాధమునకైనను,

ఈ స్మృతి నిబంధనలు వర్తించును.

విశదీకరణము :——భారత దేశములో చేసియుండినచో ఈ స్మృతి క్రింద శిక్షార్హమయియుండి భారత దేశమునకు బయట చేసిన ప్రతి కార్యము ఈ పరిచ్ఛేదములో “అపరాధము" అను పద పరిధియందు చేరియుండును.

ఉదాహరణము

భారత దేశ పౌరుడగు 'ఏ' ఉగాండాలో హత్య చేయును. భారతదేశములో అతడు దొరికిన ఏ స్థలమునందైనను హత్యకై అతనిని విచారణ చేసి దోషస్థాపన చేయవచ్చును.

ఈ చట్టము వలన కొన్ని శాసనములకు భంగము కలుగకుండుట.

5. ఈ చట్టములోనిదేదియు, భారత ప్రభుత్వ సేవలో అధికారులుగా, సైనికులుగా, నావికులుగా, లేక వైమానికులుగా ఉండి, తిరుగుబాటు చేసిన, లేక సేవను విడిచి పారిపోయిన వారిని శిక్షించునట్టి ఏదేని చట్టపు నిబంధనలకైనను, ప్రత్యేకమైన లేక స్థానికమైన శాసనముల నిబంధనలకు వేటి కైనను భంగము కలిగించదు.

అధ్యాయము-2

సాధారణ విశదీకరణములు

మినహాయింపులకు లోబడి స్మృతిలోని నిర్వచనములను అర్థము చేసికొని వలసి యుండుట.

6. ప్రతి అపరాధ నిర్వచనమును, ప్రతి శిక్షా నిబంధనను మరియు అట్టి ప్రతి నిర్వచనమునకు లేక శిక్షా నిబంధనకు గల ప్రతి ఉదాహరణమును అది “సాధారణ మినహాయింపులు " అను శీర్షిక గల అధ్యాయములోని, మినహా యింపులకు లోబడియున్నట్లు, అట్టి నిర్వచనములో, శిక్షా నిబంధనలో లేక ఉదాహరణములో ఆ మినహాయింపులు తిరిగి చెప్పబడక పోయినప్పటికినీ, ఈ స్మృతి యందంతటను అర్ధము చేసికొనవలెను.