పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12


బడిన మొత్తము కారావాసములో ఏ ఒక మాసములోనైనను ఏకాంతపు చెఱ ఏడు దినములకు మించకూడదు, మరియు ఏకాంతపు చెఱల కాలావధుల మధ్య అట్టి కాలావధులకు తక్కువ కాని విరామములు ఉండవలెను.

12వ ఆధ్యాయము లేక 17వ అధ్యాయము క్రింద కొన్ని అపరాధముల విషయంలో పూర్వము దోష స్థాపనజరిగి యున్నచో హెచ్చింపు శిక్ష.

75. ఎవరైనను

(ఏ) ఈ స్మృతి యొక్క 12వ అధ్యాయము లేక 17వ అధ్యాయము క్రింది మూడు సంవత్సరములు లేక అంతకెక్కువ కాలావధిపాటు రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపదగిన అపరాధమునకు, భారత దేశములో ఒక న్యాయస్థానముచే,

(బి) ... ... ... ... ...

దోషస్థాపితుడై యుండి, ఆ రెండు అధ్యాయములలో దేని క్రిందనైనను ఆదే కాలావధికి అదే రకపు కారావాసముతో శిక్షింపదగిన ఏదేని అపరాధమును చేసినచో, అట్టి తరువాతి ప్రతి అపరాధమునకు, యావజ్జీవ కారావాసమునకు గాని, పది సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసమునకు గాని లోను కావలసియుండును.

అధ్యాయము - 4

సాధారణ మినహాయింపులు

శాసనరీత్యా బద్దుడై యుండి, లేక తాను అట్లు బద్దుడై యున్న సంగతిని గూర్చిన పొరపాటువల్ల విశ్వసించి యుండి ఒక వ్యక్తి చేసినట్టి కార్యము.

76. ఒక వ్యక్తి దేనినైనను చేయుటకు శాసనరీత్యా బద్దుడై యుండి లేక అట్లు బద్దుడై ఉన్నానని శాసనమును గూర్చిన పొరపాటువలన గాక, సంగతిని గూర్చిన పొరపాటువలన సద్భావముతో విశ్వసించియుండి, దానిని చేసినచో, అది అపరాధము కాదు.

ఉదాహరణములు

(ఎ) 'ఎ' అను సైనికుడు శాసన ఆజ్ఞానుసారముగా, తన పై అధికారి ఆదేశమునుబట్టి , ఒకమూకపై కాల్పులు జరుపును. 'ఎ' ఎట్టి అపరాధమును చేయలేదు.

(బి) న్యాయస్థానములో ఒక అధికారి అగు 'ఏ' ఆ న్యాయ స్థానముచే 'వై'ని అరెస్టు చేయుటకు ఉత్తరువు చేయబడినవాడై , తగు దర్యాప్తు జరిపి 'జడ్' ను 'వై' అని అనుకొని 'జడ్'ను అరెస్టు చేయును. 'ఏ' ఎట్టి అపరాధమున చేయలేదు.

వ్యాయికముగా వ్యవహరించునపుడు న్యాయాధీశుడు చేసిన కార్యము.

77. శాసనము ద్వారా ఈయబడిన, లేక ఈయబడినదని తాను సద్భాసముతో విశ్వసించినట్టి, ఏదేని అధికారమును వినియోగించి ఒక న్యాయాధిశుడు, వ్యాయికముగా వ్యవహరించునపుడు చేసినట్టి దేదియు అపరాధము కాదు,

న్యాయస్థానము యొక్క తీర్పును, లేక ఉత్తరువును అనుసరించి చేసిన కార్యము.

78. "ఒక న్యాయస్థానముయెక్క తీర్పును, లేక ఉత్తరువును అనుసరించి చేయవలసినది గాని, దానిని బట్టి చేయదగిన దేనిని గాని ఒక వ్యక్తి అట్టి తీర్పు, లేదా ఉత్తరువు అమలులో ఉండగా చేసినచో, ఆ కార్యమేదియు, అట్టి తీర్పును, లేక ఉత్తరువును ఇచ్చుటకు ఆ న్యాయస్థానమునకు అధికారిత లేనప్పటికినీ, ఆ న్యాయస్థానమునకు అట్టి అధికారిత ఉండెనని ఆ కార్యము చేసిన వ్యక్తి సద్భావముతో విశ్వసించియుండినట్లయితే, అపరాధము కాదు.

ఒక వ్యక్తి శాసన సమర్ధన గలిగి, లేక తనకు అట్టి సమర్థన గలదనే సంగతిని గూర్చిన పొరపాటు వలన విశ్వసించి, చేసిన కార్యము.

79. శాసన సమర్థన కలిగియుండి, లేక శాసనమును గూర్చిన పొరపాటువలన గాక సంగతిని గూర్చిన పొరపాటు వలన తనకు శాసన సమర్ధన గలదన్న సద్భావముతో విశ్వసించి యుండి, ఎవరేని వ్యక్తి చేసినదేదియు ఆపరాధము కాదు.

ఉదాహరణము

'ఏ' కు హత్యగా కాన్పించెడు ఒక పనిని 'జడ్' చేయుచుండగా 'ఏ' చూచును. హత్య చేయుచున్న హంతకులను పట్టుకొనుటకు వ్యక్తులందరికి శాసన మొసగిన అధికారమును పురస్కరించుకొని సద్భావముతో తనకు ఉత్తమమని తోచినంత మేరకు, 'జడ్'ను సముచిత ప్రాధికారుల సమక్షమునకు తీసికొనిపోవుటకుగాను, 'జడ్'ను 'ఏ' పట్టు కొనును. 'జడ్' ఆత్మరక్షణకై వ్యవహరించుచుండెనని చివరకు తేలినప్పటికినీ, 'ఏ' ఎట్టి అపరాధమును చేసియుండలేదు.

శాసనసమ్మతమైన కార్యము చేయుట యందు దుర్ఘటన.

80. శాసనసమ్మతమైన కార్యమును శాసనసమ్మతమైన రీతిలో శాసనసమ్మతమైన పద్ధతుల ద్వారా తగు జాగరూకత, హెచ్చరికలతో చేయుటలో ఎట్టి అపరాధిక ఉద్దేశముగాని, అట్టి ఎరుక గాని లేకుండ దుర్ఘటన లేక దురదృష్టమువలన చేసినదేదియు అపరాధము కాదు.