పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అధ్యాయము --21

పరువు నష్టమును గురించి

పరువు నష్తము.

499. పలికిన మాటలు, లేక చదువుటకుద్దే శింపబడిన పదముల ద్వారా గాని, సంజ్ఞల ద్వారాగాని, దృశ్య రూపణముల ద్వారా గాని, ఏదేని ఆరోపణను చేయుటవలన ఎవరేని వ్యక్తి యొక్క ఖ్యాతికి హానికలిగించు ఉద్దేశముతో నై నను, హాని కలిగించునని ఎరిగియుండియైనను, హాని కలిగించగలదని విశ్వసించుటకు కారణము కలిగియుండి యైనను అట్టి వ్యక్తికి సంబంధించి ఏదేని అట్టి ఆరోపణను చేయు లేక అట్టి ఆరోపణను ప్రచురించు నారెవరై నను, ఇందు ఇటు పిమ్మట మినహాయింపబడిన సందర్భములలో తప్ప, ఆ వ్యక్తికి పరువునష్టము కలిగించినట్లు చెప్పబడుదురు,

విశదీకరణము 1:- మరణించిన వ్యక్తి పై ఏదేని ఆరోపణను చేయుట, ఆ వ్యక్తి జీవించియున్నచో అతని ఖ్యాతికి ఆ ఆరోపణ హాని కలిగించునదైయుండి, అతని కుటుంబమువారి లేక ఇతర సన్నిహిత బంధువుల మనసులను నొప్పించుటకు ఉద్దేశింపబడినదైనచో, పరువు నష్టము క్రిందికి రావచ్చును.

విశదీకరణము 2:-ఒక కంపెనీకి సంబంధించిగాని, వ్యక్తుల అసోసియేషనుకు లేక సముదాయమునకు సంబంధించి గాని సామూహికముగా ఒక ఆరోపణను చేయుట పరువు నష్టము క్రిందికి రావచ్చును.

విశదీకరణము 3:- అనుకల్పికముగగాని, వ్యంగ్యముగా గాని వ్యక్త పరచబడిన ఆరోపణము పరువు నష్టము క్రిందికి రావచ్చును.

విశదీకరణము 4 :--- ఒక ఆరోపణము, ప్రత్యక్షముగగాని పరోక్షముగగాని, ఇతరుల దృష్టిలో ఒకవ్యక్తి యొక్క నైతిక ప్రతిపత్తిని లేక మేథా సంపత్తిని కించపరచునదైననే తప్ప, లేక అతని కులమున కైనను, ఆ జీవికైనను సంబంధించి అట్టి వ్యక్తి యొక్క శీలమును కించపరచునదైననే తప్ప, లేక ఆ వ్యక్తి యొక్క పరపతిని కించ పరచునదై ననేతప్ప, లేక ఆ వ్యక్తి యొక్క శరీరము జగుప్సాకరమైన స్థితిలో గాని సామాన్యముగా తలవంపులు కల్గిగించునని తలచబడు స్థితిలోగాని ఉన్నదని విశ్వసింపజేయునదైననే తప్ప, ఏ ఆరోపణము కూడ ఆ వ్యక్తి యొక్క ఖ్యాతికి హాని కలిగించినట్లు చెప్పబడదు.

ఉదాహరణములు

(ఏ)'బీ' యొక్క గడియారమును 'జడ్' దొంగిలించెనని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'ఏ' అనునతడు "'జడ్' నిజాయితీగల మనిషి, 'బి' యొక్క గడియారమును అతడు దొంగిలించనేలేదు” అని చెప్పెను. మినహాయింపులలో ఒక దాని క్రిందకు వచ్చిననే తప్ప, ఇది పరువునష్టము అగును.

(బి) 'బీ' యొక్క గడియారమును ఎవరు దొంగిలించినారని 'ఏ'ని అడిగిరి, 'బీ' యొక్క గడియారమును 'జెడ్' దొంగిలించెనని విశ్వసింపజేయు ఉద్దేశముతో, “ఏ' తన వేలుతో 'జడ్' ను చూపును. మినహాయింపులలో ఒక దాని క్రిందకు వచ్చిననే తప్ప, ఇది పరువునష్టము అగును.

(సీ) 'బీ' యొక్క గడియారమును 'జడ్' దొంగిలించెనని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'ఏ' అను నతడు 'బీ' యొక్క గడియారముతో 'జడ్' పరిగెత్తి పోవుచున్నట్లు ఒక చిత్రము వేయును. మినహాయింపులలో ఒక దాని, క్రిందకు వచ్చిననే తప్ప, ఇది పరువునష్టము అగును.

ప్రజా శ్రేయస్సు చేయవలసిన లేక ప్రచురించవలసిన నిజమైన ఆరోపణము.

మొదటి మినహాయింపు :- ఎవరేని వ్యక్తికి సంబంధించి నిజమైన ఆరోపణను దేనినైనను ప్రజాశ్రేయస్సు దృష్ట్యా చేయవలసియున్నచో, లేక ప్రచురించవలసియున్నచో, అట్టి ఆరోపణచేయుట పరువునష్టము కాదు, ఆరోపణము ప్రజాశ్రేయస్సుకై చేసినదా కాదా అనునది సంగతిని గూర్చిన ప్రశ్న.

పబ్లిక్ సేవకుల పబ్లికు నడవడి.

రెండవ మినహాయింపు : -పబ్లికు కృత్యముల నిర్వహణములో ఒక పబ్లికు సేవకుని నడవడిని గురించి లేక ఆ నడవడినిబట్టి విదితమగునంత మేరముట్టు కే అతని శీలమును గురించి ఏ అభిప్రాయమునై నను సద్భావముతో వ్యక్తము చేయుట పరువునష్టము కాదు.

ఏదైనా ప్రజాసమస్య సంబంధముగ ఎవరేని వ్యక్తి యొక్క నడవడి.

మూడవ మినహాయింపు : ఏదైనా ప్రజా సమస్య సంబంధముగా ఎవరేని వ్యక్తి యొక్క నడవడిని గురించియు ఆ నడవడినిబట్టి విశదమగునంత మేరమట్టుకే అతని శీలమును గురించియు ఏ అభిప్రాయమునై నను సద్భావముతో వ్యక్తము చేయుట పరుపునష్టము కాదు.