పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ పరిచ్ఛేదము విస్తరించదు. అయితే, అతనికి లేక ఆమెకు తెలిసియున్నంత మేరకు వాస్తవముగా ఆ సంగతులను,ఏ వ్యక్తి తో అట్టి వివాహము జరుగుచున్నదో ఆ వ్యక్తికి, అట్టి వివాహము జరుగుటకు పూర్వమే అతడు లేక ఆమె తెలియజేసి యుండవలెను.

ఏ వ్యక్తి లో తరువాతి వివాహము జరిగినదో ఆ వ్యక్తి కి పూర్వవివాహ విషయమును తెలియకుండ కప్పిపుచ్చి పై అపరాధము చేయుట.

495. ఏ వ్యక్తి తో తరువాతి వివాహము జరిగినదో ఆ వ్యక్తి కి పూర్వ వివాహపు సంగతి తెలియకుండ కప్పి పుచ్చి పై కడపటి పరిచ్ఛేదములో నిర్వచింపబడిన అపరాధమును చేయువారెవరైనను, పది సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుగురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

శాసన సమ్మత వివాహము కాకుండ కపటముతో వివాహ సంస్కారమును జరిపించు కొనుట.

496. నిజాయితీ లేకుండగాని, కపట ఉద్దేశముతోగాని, వివాహ సంస్కారమును, తద్వారా తనకు శాసన "సమ్మతమైన వివాహము జరుగుట లేదని ఎరిగియుండియు జరిపించుకొను వారెవరై నను, ఏడు సంవత్సరముల దాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో శిక్షింపబడుదురు, మరియు జుర్మానాకు కూడ పాత్రులగుదురు.

వ్యభిచారము

497. ఒకవ్యక్తి పర పురుషుని భార్యయై యుండగా ఆ సంగతి తాను ఎరిగియుండియు, లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణముండియు, ఆ పురుషుని యొక్క సమ్మతిగాని మౌనానుకూలతగాని లేకుండ, ఆ వ్యక్తితో సంభోగించు నతడెవరైనను, ఆ సంభోగము మానభంగాపరాధము క్రిందికి రానిదైనచో, వ్యభిచార అపరాధమును చేసినవాడగును, మరియు ఐదు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతో గాని, ఈ రెండింటిలో గాని శిక్షింపబడును. అట్టి సందర్భములో ఆ భార్యను దుష్ప్రేరకు రాలుగ శిక్షింపరాదు.

వివాహిత స్త్రీ ని అపరాధిక ఉర్దేశముతో ఆశచూపి రప్పించు కొనుట లేక తీసికొనివెళ్లుట లేక నిరోధములో ఉంచుట.

498. పరపురుషుని భార్యయై యున్న స్త్రీని ఎవరినై నను, ఆ సంగతి తాను ఎరిగి యుండియు, లేక అట్లని విశ్వసించుటకు తనకు కారణముండియు, ఎవరేని వ్యక్తి ఆమెతో అక్రమ సంభోగము చేయవలెనను ఉద్దేశముతో అట్టి పురుషుని నుండి లేక అట్టి పురుషుని తరఫున ఆమె రక్షణ బాధ్యతగల ఎవరేని వ్యక్తి నుండి ఆమెను తీసికొని పోవు లేదా ఆశచూపి రప్పించుకొను, లేదా అట్టి ఉద్దేశముతో అట్టి స్త్రీని ఎవరినైనను దాచు లేదా నిరోధములో ఉంచు నతడెవరైనను, రెండు సంవత్సరములదాక ఉండగల కాలావధికి రెంటిలో ఒక రకపు కారావాసముతో గాని, జుర్మానాతోగాని, ఈ రెండింటితో గాని శిక్షింపబడును.

అధ్యాయము-20..ఏ

భర్త యొక్క లేక ఆతని బంధువుల యొక్క క్రూర ప్రవర్తన

స్త్రీ యొక్క భర్త గాని ఆతని బంధువుగాని ఆమెపట్ల క్రూరముగ ప్రవర్తించుట,

498-ఏ. ఒక స్త్రీ పట్ల ఆమె భర్త గాని, అతని బంధువుగాని క్రూరముగా ప్రవర్తించినచో, ఆతడెవరైనను మూడు సంవత్సరములదాక ఉండగల కాలావధికి కారావాసముతో శిక్షింపబడును, మరియు జుర్మానాకు కూడ పాత్రుడగును.

విశదీకరణము :---ఈ పరిచ్ఛేదము నిమిత్తము 'క్రూర ప్రవర్తన' అనగా:

(ఏ) స్త్రీ ఆత్మహత్యకు దారితీయునటు వంటి లేక ఆ స్త్రీ ప్రాణమునకు గాని, ఆమె అవయవమునకు గాని, (మానసికమై నదైనను, శారీరకమై నదైనను) ఆమె ఆరోగ్యమునకుగాని, తీప్రమైన హానిని లేక అపాయమును కలిగించజాలునటువంటి బుద్ధి పూర్వకమైన ఏదేని నడవడి, లేక


(బీ) ఏదేని ఆస్తి గాని, విలువైన సెక్యూరిటీగాని కావలెనను శాసనసమ్మతముకాని ఏదేని కోరికను నెరవేర్చుటకు ఆ స్త్రీని, లేదా, ఆమె బంధువైన ఎవరేని వ్యక్తిని బలవంత పెట్టు దృష్టితో, లేక అట్టి కోరికను ఆమెగాని,ఆమె బంధువైన ఎవరేని వ్యక్తి గాని నెర వేర్చనందుకు ఆ స్త్రీని వేధించిన యెడల, అట్టి వేధింపు అని అర్హము.