పుట:ది ఇండియన్ పీనల్ కోడు.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తాను తయారు చేసినానని అతనికి తెలిపి 'జడ్' చే ఆ వీలునామా పై సంతకము చేయించును. 'ఏ' కూటరచన చేసినవాడగును.

(జే) 'ఏ' అనునతడు ఒక జాబుద్వారా, 'జడ్' నుండి మరియు ఇతర వ్యక్తు లనుండి ముష్టి ఎత్తు కొనవలెనను ఉద్దేశముతో 'ఏ' సచ్ఛీలుడనియు, దురదృష్టవశాత్తు దీనస్థితిలో ఉన్నాడనియు, జాబును 'బీ' వ్రాసి యిచ్చినట్లు అతని ప్రాధికారము పొందకుండ 'ఏ' వ్రాసి 'బీ' పేరిట సంతకము చేయును. ఇచట 'జడ్'చే 'అతని ఆస్తిని ఇప్పించుకొనుటకుగాను 'ఏ' తప్పుడు దస్తా వేజులను రూపొందించినందున 'ఏ' కూట రచన చేసిన వాడగును.

(కే) 'జడ్' వద్ద ఉద్యోగమును పొందు ఉద్దేశముతో 'ఏ' అనునతడు. తాను సచ్చీలుడని తెలుసు ఒకజాబును 'బీ' వ్రాసియిచ్చినట్లు వ్రాసి 'బీ' యొక్క ప్రాధికారము పొందకుండ దాని పై 'బీ' పేరిట సంతకము చేయును 'ఏ' కూట రచిత సర్టిఫికేటుచే 'జడ్'ను మోసగించి తద్వారా ఒక అభివ్యక్తమైన లేక గర్భితమైన సేవా కాంట్రాక్టును 'జడ్' తనతో కుదుర్చుకొనునట్లు చేయుటకు ఉద్దేశించినందున 'ఏ' కూటరచన చేసినవాడగును.

విశదీకరణము 1: ఒకమనిషి తన పేరిటనే తాను సంతకము చేయుట కూట రచన కావచ్చును.

ఉదాహరణములు :

(ఏ) 'ఏ' తన పేరేగల వేరొక వ్యక్తి చే వినిమయ పత్రము వ్రాయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో తన పేరులోనే ఆ వినిమయ పత్రము పై సంతకము చేయును. 'ఏ' కూటరచన చేసినవాడగును.

(బీ) 'ఏ' అనునతడు ఒక ఖాళీ కాగితము పై "స్వీకరింపబడినది.” అను పదమును వ్రాసి 'జడ్' పేరుతో సంతకము చేయును. ఇందుమూలముగా తరువాత ఆ కాగితముమీద 'జడ్' పై ఒక వినిమయ పత్రమును 'బీ' వ్రాసి ఆ వినిమయపత్రము 'జడ్' స్వీకరించినట్లుగా దాన్ని పరాక్రాంతము చేయుట అతని ఉద్దేశమై యున్నది 'ఏ' కూటరచన చేసిన వాడగును, మరియు 'బీ' ఆ సంగతి ఎరిగియుండి 'ఏ' యొక్క ఉద్దేశమును పురస్కరించుకొని కాగితము పై ఆ పత్రమును వ్రాయుచో, 'బి' కూడ కూటరచన చేసినవాడగును.

(సీ) 'ఏ' అనునతనికి అదే పేరుగల వేరొక వ్యక్తి యొక్క ఆర్డరు పొందినవారికి చెల్లించవలసిన ఒక వినిమయ పత్రము దొరకును. ఎవరి ఆర్డరు ప్రకారము ఆ పత్రము చెల్లింపబడవలసియుండునో ఆవ్యక్తి చే పీటీ వ్రాయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో 'ఏ' కు చెల్లింప వలసినదని ఆ వినిమయ పత్రము పై తానే పీటీ వ్రాయును. ఇచట 'ఏ' కూటరచన చేసినవాడగును.

(డీ) 'బి' ఆనునతని పై ఒకడిక్రీని అమలు పరచుటలో విక్రయింపబడగా ఒక ఎస్టేటును ఏ' కొనును. ఎస్టేటు అభి గ్రహణము చేయబడిన తరువాత 'బీ' 'జడ్' తో లాలూచిపడి 'ఏ' ను కపటమునకు గురిచేయు ఉద్దేశముతోను, అభిగ్రహణమునకు మునుపే 'బీ' చే కౌలుకు యొసగబడి దని విశ్వసింపజేయుటకును, 'జడ్' పేరిట ఆ ఎస్టేటు విషయమున నామమాత్రపు మక్తాకు దీర్ఘ కాలికముగా, కౌలును నిష్పాదనచేసి, ఆ కౌలుపై అభి గ్రహణమునకు ఆరునెలల ముందటి తేదీ వేయును. 'బీ' కొలును తన పేరులోనే నిష్పాదన చేసినను కౌలు పై అంతకు ముందటి తేదీని వేయుట వలన, అతడు కూటరచన చేసినవాడగును.

(ఈ) వ్యాపారస్తు డైన 'ఏ' తాను దివాలా తీయుదునని ముందుగా ఊహించి తన ఋణదాతలను కపటమునకు గురిచేయవలెనను ఉద్దేశములో, తన చరాస్తి ని 'ఏ' యొక్క. మేలుకొరకై 'బీ' పరముచేసి ఆ వ్యవహారము నిజమై నదిగా కాన్పించునట్లు చేయుటకుగాను 'బీ' నుండి తాను ఒక మొత్త మును అప్పు తీసికొన్నందుకై , ఆ మొత్తమును చెల్లింతునని ఒక ప్రోనోటు వ్రాసి తాను దివాలా తీయు దశకు చేరకముందే దానిని వ్రాసినట్లు విశ్వసింపజేయ ఉద్దేశముతో పత్రము పై అంతకు ముందటి తేదీని వేయును. 'ఏ' ఈ నిర్వచనపు మొదటి శీర్షిక క్రింద కూటరచన చేసినవాడగును.

విశదీకరణము 2 : ఒక తప్పుడు దస్తా వేజును ఆది వాస్తవమైన వ్యక్తి చే చేయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో ఒక కల్పిత వ్యక్తి పేరునగాని, అది ఒక వ్యక్తి చే అతని జీవితకాలములో చేయబడినదని విశ్వసింపజేయు ఉద్దేశముతో మరణించిన ఒక వ్యక్తి పేరున గాని రూపొందించుట కూటరచన కావచ్చును.

ఉదాహరణము

ఒక వినిమయపత్రమును ఒక కల్పితవ్యక్తి పై వ్రాసి, దానిని పరాక్రాంతము చేయు ఉద్దేశముతో అట్టి కల్పిత వ్యక్తి పేరులో కపటముతో 'ఏ' అనునతడు ఆ పత్రమును స్వీకరించును. 'ఏ' కూటరచన చేసినవాడగును.