పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

స్వామి యాలయమున్నది. మరింగంటి చెన్నయ్యగారని నేటికిని ఆప్రాంతపుప్రజలు గుట్టపై దేవళమున గల పుట్టయందు పాలు పోయుట పరిపాటి. అంతే గాక ప్రత్యేకముగా పూజలును సల్పుదురు. ఈయన 'దశనవసంఖ్య యగ్రజులు తద్దయు కూర్మి భజించుచుండగా' నుండెనట. ఈయన జన్మకారణము ననుసరించి యేమో, మరింగంటివారు నేటికిని సర్పమును పూజించుటయేగాక ఎంత భక్తి ప్రపత్తులతోనో చూచుదురు.

2. అప్పలాచార్యులు:- రాజాస్థానములయందు మరింగంటివారిపేరు ఈయననుండి వినిపించుచున్నది. ఈ అప్పలాచార్యులు ముగ్గురురాజులచేత మ్రొక్కులు గొన్నట్టి భగవత్సమానుఁడు (ద. రా. నం. చ.) మత్తేభనరహయమనుజేంద్రమకుటాగ్రమిళితాంఘ్రియుగళుఁడు' (ని.సి.క.) ముగురురాజు లనగా నరపతులు అశ్వపతులు గజపతులు.

మొట్టమొదటి యచ్చతెనుగుకావ్యముగా పరిగణింపబడుచున్న 'యయాతిచరిత్ర'ను పొన్నికంటి తెలగన్న మల్కిభరాంవద్ద మీర్ జుమ్లా (ఆర్థికమంత్రి) పదవిలోనున్న అమీనుఖానునకు అంకితమిచ్చినాడు. ఈవిషయమున తెలగన్నకు ప్రోత్సాహ మొసగినది అప్పలాచార్యులే యనుటకు యయాతి చరిత్రమందలి -

'తనకు న్నిచ్చలు మ్రొక్కువారిని సిరుల్ దైవారఁగాఁ జల్ల చూ
పున నెల్లప్పుడుఁ జూచి మన్పఁగల పెన్ప్రోడన్ మఱింగంటి య
ప్పనగారిన్ మదిలోనిమాట దెలియం బాటించుచుం గాంచినన్
గని యామేటితలం పెఱింగి పొసగంగా నన్ను మన్నించుచున్.'
పిలిచి పొన్నికంటి తెలగన్న నీచేయు
నచ్చతెనుఁగుఁగబ్బ మన్నియెడల
మించి వెలయఁగా నమీనుఖానున కిచ్చి
పుడమిలోన సిరులఁ బొగడు కనుము"

(1-9, 10)

అను పద్యములవలన తెలియుచున్నది. తెలగన్న తెల్పినప్రకారముగా నాలోచించినచో అప్పలాచార్యులు మల్కిభరాం ఆస్థానమున విశేషగౌరవాదరములతో నుండి, బహుదేశబుధులతో విద్యాపరీక్షల కాలము గడుపుచుండెడివా డని తోచుచ్నుది. అంతేగాక 'ఉభయవేదాంతార్థవిభవుఁడై ప్రభు