పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సీ.

ముగురు రాజులచేత మ్రొక్కులు గొన్నట్టి
             భగవత్సమానుఁ డప్పలగురుండు
వేదవేదాంగాదివివిధార్థసంపత్తి
             నతిశయిల్లిన వేంకటార్యమౌళి
కలితసౌందర్యరేఖావిలాసంబులఁ
             జెంగలించెడి శ్రీనృసింహఘనుఁడు
కుపితమాయావాది గురుశాస్త్రహరణపా
             రగుఁడైన కోనేటిరాయశౌరి
సరసశతపద్యలేఖనీవిరచనోక్తి
గలజగన్నాథసూరి యగ్రజులు గాఁగ
నలర రంగప్ప, నరసింగరప్ప తమ్ము
[1]లై వెలయువాఁడ భువి సింగరాహ్వయుండ.

30


మ.

సముదీర్ణస్థితి వేంకటేశ్వరుఁడు నాస్వప్నంబునన్ షోడశా
బ్దములన్ [2]మాణవకాకృతి న్నిలిచి ‘వత్సా యాంధ్రభాషానిరో
ష్ఠ్యమహాకావ్య మొనర్పుమీ' యనిన నత్యారూఢి మేల్కాంచి మో
దమునన్ జెప్పితి భూమిపైఁ గవిజనాధ్యక్షు ల్ప్రశంసింపఁగన్.

31


మ.

మును రామాయణము న్నిరోష్ఠ్యముగ నింపుల్ మీద శాకల్లె మ
ల్లన, తా సంస్కృతభాషఁ జేసెనన నాలాగున్ జెవుల్ నిండఁగా
వినుటేగాని ధరిత్రిలో నిజముగా వీక్షింపలే దట్టి దేఁ
దెనుఁగున్ జేసెద నెల్లెడన్ గవులకున్ దృష్టాంతమై యేర్పడన్.

32


మ.

వరవందారుజనావళీహృదయసద్వాంఛార్థకృద్వేంకటే
శ్వరసంపూర్ణ[3]కృపాసుధామిళితవీక్షామాధురీమార్గవి
స్ఫురితైకైకదినప్రబంధరచనాస్ఫూర్జద్వచశ్రీకుఁడన్
నరనాగాశ్వనృపాలసభ్యగణితుండన్ సింగరాచార్యుఁడన్.

33
  1. లై మెఱయువాఁడ (ము)
  2. మానవునాకృతి (సా)
  3. కటాక్షమిళితక్ష్మామాధురీ (సా)