పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


దేశికునకు దనూజులై తిరుమలయ్య
భట్టరుఁడు సింగరప్పఁడు ప్రబలి రందు.

22


చ.

విరివిగ భట్టరార్యునకు వేంగళనాథుఁడు పుట్టె వానికిన్
బరమతభేది తిర్మలయ భట్టరుఁడున్ బ్రభవించె నందులన్
దిరుమలసూరికిన్ గలిఁగెఁ దేజున మించిన వేంగళప్పఁడున్
సరసగురుం డనంతుఁడు ఘనప్రతిభాడ్యుఁడు సింగరప్పఁడున్.

23


వ.

అందగ్రజన్ముండు.

24


చ.

కలిమికి రాజరాజు, బలుకాంతులఁ జుక్కలరాజు, రూపురే
ఖల వలరాజు, వైభవవికాసమునన్ సురరాజు, సత్యపుం
బలుకుల ధర్మరాజు, ఘనభాగ్యమునన్ వసురాజు నా దగెన్
బలియుఁడు వెంగళార్యగురు పట్టపురాజు జగత్ప్రసిద్ధుఁడై.

25


క.

సరసుఁడు వేంగళగురుమణి
వరదాంబన్ బెండ్లియాఁడె వనజాక్షుం డా
శరనిధికన్యారత్నము
వరియించినపోల్కి నధికవైభవ మెసఁగన్.

26


వ.

అట్టివరదాంబ యెట్టిదంటేని -

27


చ.

విడిముడి గల్గి బంధువులు వేడ్క గృహంబున నిండియుండ నె
ప్పుడు ధనధాన్యముల్, మణులు, బుట్టములున్, బశువుల్, తురంగముల్
తొడవులుఁ, జేత లక్ష్మి తులఁదూగుచుఁ బట్టిన దెల్లఁ బైడియై
పుడమి బ్రసిద్ధి కెక్కె హరిపూర్ణకృపన్ వరదాంబ యెంతయున్.

28


తే.

అట్టి మరిఁగంటి తిరువేంగళార్యువలనఁ
వరదయాగుణ నికురుంబవరదమాంబ
[1]శీలసౌందర్యవిద్యావిశేషకళల
బలియులైనట్టి యష్టపుత్త్రులను గనియె.

29
  1. సిరులసౌందర్య (వ్రా), లలితసౌందర్యవిద్యావిలాసములను (సా)