పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలంగాణమున ప్రాచీనగ్రంథసంరక్షణ మెట్లుండునో మన మూహించుకొనగలము[1]. తాళపత్ర ప్రాచీనగ్రంథసంపత్తు తెలంగాణములో నింకను గలదు. కాని లభించినవాని గతియే యిట్లున్నప్పుడు చెడిపోవుట కెచ్చట నున్న నేమి? భవిష్యత్తులో నైనను వీనికి సుదినములు రావలయునని యాశించుట మన విధిగద! తాళపత్రగ్రంథములు వందలకొలదిగా సంపాదించి వానిని సంరక్షించలేక, ప్రభుత్వమువారు వీరిని లక్ష్యపెట్టక, అవి యన్నియు చాలా భాగము నష్టము లగుచుండుట నాగుర్తులో గల విషయము.

తెనుగు సారస్వతము రాజాశ్రయముచే నెక్కువగా అభివృద్ధి గాంచినది. రాజరాజనరేంద్రుని నుండి యిట్టిప్రాపు గలదు. కాలక్రమముగా రానురాను చిన్న చిన్న సంస్థానము లేర్పడినవి. వాటిలో ఆంధ్రప్రాంతమందలి నూజివీడు, బొబ్బిలి, విజయనగరము, పిఠాపురము, మొదలగునవియు తెలంగాణమందలి మహబూబునగరం జిల్లాలోని గద్వాల, వనపర్తి, ఆత్మకూరు, కొల్లాపురము, జటప్రోలు, దోమకొండ మొదలగునవియు నల్లగొండ జిల్లాయందలి రాజాచలమను నామాంతరముగల రాచకొండ, సంస్థాననారాయణపురము, నడిగూడెము, బేతవోలు మొదలైనవియుగా ఈసంస్థానములు ఎందరో కవి పండితులను పోషించి వారిచే నమూల్యకృతిరత్నముల వెలయింపచేసినవి. సంస్థానాధిపతులు కృతిభర్తలేగాక కృతికర్తలుగను ప్రసిద్ధిగాంచినారు.

గద్వాల వనపర్తి సంస్థానములు దశాబ్దమునకు పూర్వమును మానవల్లివారి సాహిత్యకృషికిని, తిరుపతి వేంకటకవుల అవధానవర్షమునకును దివ్యసాహితీఫలముల నందింప నోచుకొనినవి. నీతివాచస్పతులును, మానినీమన్మథులు నైన సురభివారు కొల్లాపుర సంస్థానాధిపతులు. వీరు చంద్రికాపరిణయాదు లొనర్చినవారు. రాచకొండ సంస్థానము శ్రీనాథునంతటివానికి కనకాభిషేకము చేసినది. అంతేకాక రసార్ణవసుధాకరాది గ్రంథములు వెలువడిన దీయాస్థానముననే! సంస్థాననారాయణపురము, బేతవోలు, 'సమాగతామితవచ స్స్వీకారశయ్యాచమత్కృతి సద్గ్రంథకవిత్వతత్వఘటనా

  1. "మనప్రాచీన(తాళపత్ర)గ్రంథములు - వానిదుస్థితి"- (శ్రీ) “కృష్ణాపత్రిక" (1967 స్వాతంత్యదినోత్సవసంచిక)