పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంతకాలము క్రిత మొకప్రబుద్ధుడు 'నిజాం రాష్ట్రమున ఆంధ్రకవులు-పండితులు పూజ్యము' అని వ్రాసెనట.[1] ఈ వాక్యమునకు నాటిపెద్దలు-సాహిత్యాభిమానులు ఎంతకుమిలిపోయిరో? తద్బాధానివారణార్థము 'ఇదిగో మా తెలంగాణ మందలి కవులు....' అని చూపుటకు సిద్ధ మొనర్చినదే 'గోలకొండ కవుల సంచిక' సంపాదకు లీసంచికను తాత్కాలికకాలహరణమునకో—వినోదమునకో సిద్ధము చేసినదిగాక - ఇది 'తెలంగాణకవుల కవిలె'వలె శాశ్వతముగా నుండునట్లు చేసినది. ఈ గో. క. సంలోగల కవుల జాడ-గ్రంథముల వివరములు-నేటికే కొన్ని విస్మృతప్రాయము లయినవనినచో — సంచికానిర్మాణమే జరుగకున్న నిక యెట్లుండెడిదో? దీనియందు కొన్నిపొరపా ట్లున్నను తెలంగాణకవులను గూర్చి సంక్షిప్తపరిచయము చేసికొనుటకు మాత్రము ప్రథమపాథేయముగా - సాహిత్యలోకసంచారకుల కీసంచిక యుపకరించుననుటలో నెట్టి సంశయమును లేదు.

మన తెనుగుసాహిత్యచరిత్రలం దేమి కవులచరిత్రలయం దేమి కవులను గూర్చి వ్రాయునపుడు ముఖ్యముగా కాలనిర్ణయాదులు చేయునపుడు ఆయా కవులను ఇతడు మాప్రాంతమువాడే యనియు - కాదు ఈప్రాంతమువా డనియు కొన్ని దశాబ్దములు శతాబ్దములు వెనుకకు ముందునకు లాగి బీభత్సము చేసినారు. అంతతో నాగక కవులను గూర్చి వివాదములను ప్రత్యేకగ్రంథములుగనే ముద్రించుకున్నారు. ఓరుగల్లు పోతన్నను కడపకు, నల్లగొండ జిల్లా పాల్కురికి సోముని (బమ్మెర, పాల్కురికి నేడు వరంగల్లు జిల్లాలో చేరినవి) కర్ణాటకప్రాంతమునకును, మహబూబునగర జిల్లా అప్పకవిని గుంటూరుకు లాగి వీరిని యచ్చటివారని నిరూపించుటకు 'చారిత్రకపరిశోధనాసర్కసు' చేసినారు. ఇట్టి స్థితి ప్రస్తుతకాలమున కొంత తగ్గినను అచ్చటచ్చట నయోమయస్థితి మాత్రము గలదు.

తెలంగాణ మందలి ప్రాచీన-తాళపత్రగ్రంథముల సంపాదించి ప్రత్యేకగ్రంథాలయ మేర్పరచి - ఆయా జిల్లాల కవుల చరిత్రను సమగ్రముగా సిద్ధము చేసిననా డిట్టిబాధలన్నియు తొలిగి తెలంగాణకవులచరిత్ర ఉద్యమస్వరూపము స్వరూపముగా గోచరించును. కానీ యీ బృహత్ప్రణాళిక యొక్కరిచేతిమీదుగా జరిగి - సుదీర్ఘపరిశ్రమయు ఫలవంతనుగుట దుస్త

  1. గోలకొండ కవుల సంచిక (1948) "ప్రస్తావన" xili (గో.క.సం.)