పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/249

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉ.

శ్రీకరరామభారతవిశేషకథాజలరాశిఁ ద్రావి య
స్తోకపదార్థరత్నములు తోరముగా బుధకోటి కిచ్చి సు
శ్లోకరుచుల్ దిగంతముల లోకములం బ్రసరింపఁజేయు వా
ల్మీకిఁ బరాశరాత్మజు నమేయగవీంద్రులఁ బ్రస్తుతించెదన్.

7


గీ.

జలజలోచనపరికరాంశప్రభూతు
లైన పన్నిద్దరాళ్వార్ల నభినుతించి
వాసి డెబ్బదినాల్గుసింహాసనముల
గురువుల భజింతు శుభములు పరిఢవిల్ల.

8


ఉ.

ఆరయ శబ్దహీనమగునట్టి పదస్థితి గల్గి పై నలం
కారములెవ్వియు న్గనక గ్రమ్మినశయ్యలసంధి దెల్పుచున్
గౌరవవృత్తి యర్థములు గానని యాకవిచోరకోటి ని
స్సారము సేయఁగాఁదగు వెసన్ ద్విజరాజకళాసమృద్ధిచేన్.

9


వ.

అని యిట్లు నిష్టదేవతాప్రార్ధనంబును బూర్వాచార్యసంకీర్తనంబును
సుకవిభూషణంబునుగావించి మఱియు నొకనాటిరేయి నిద్రించు
సమయంబున

10


ఉ.

నల్లనిమేనుఁ తెల్లతిరునామము ముంజి పసిండిజందెమున్
జల్లనిగన్నులున్ గరుణజల్లెడుచూపులు లేతనవ్వు భా
సిలఁగ కర్పరాద్రినరసింహుఁడు తానగు వేంకటేశ్వరుం
డల్లన బ్రహ్మచారిగతి నగ్రమహీస్థలి నిల్చి వేడుకన్.

11


గీ.

వత్స! నీయెడ మత్కృప వనరు కతన
హెచ్చి భువిలోన నేరికి నెన్నరాని
యచ్చతెనుఁగైన పదముల నమితకృతులు
నిచ్చ రచియించి నొసఁగితౌ యెలమి మాకు.

12


వ.

అవి యెవ్వి యనినన్ వివరించెద వినుండు.

13


సీ.

"సిరుల తొమ్మిదియేండ్ల వరదరాజస్తుతి
             శ్రీరంగశతకంబుఁ జెప్పినావు