పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుద్ధాంధ్ర నిరోష్ఠ్య సీతాకల్యాణము

కృత్యాది

శా.

శ్రీరామామణిమేచకాంబుదముపైఁ జెల్వొందు విద్యుల్లతా
కారప్రక్రియ యక్కునందనర భక్తవ్రాతసస్యంబులన్
కారుణ్యాంచసుధాంబులన్ మనువుచున్ గారామునన్ బ్రోచు లీ
లారోచిష్ణుఁడు కర్పరాద్రిహరి చాలాయుక్తి మమ్మేలుతన్.

1


చ.

ఘనఘనసారసక్రముకగంధపుపూతసహస్రపత్రమై
యొనరెడుభర్త యక్కున సముజ్జ్వలకౌస్తుభకర్ణికస్థలం
బున విలసిల్లుచున్ గడుప్రమోదముఁ జెందు రమావధూటి తా
ననిశము మాగృహంబున ప్రియం బొందవంగ వసించి గావుతన్.

2


ఉ.

వెన్నునివేయినామములు వేడుకచే పఠియించుకోస మ
భ్యున్నతి పెక్కుమోములు సముజ్జ్వలవృత్తి ధరించి పాదుకల్
సన్నిల నాతపత్రవటశయ్యలు దానయి సేవఁ జేయు నా
పన్నగభర్త మత్కృతి శుభస్థితిచే సమకూర్పఁజేయుతన్.

3


చ.

దనుజుల నాజిఁ గూల్చిన ప్రతాపము కీర్తియు రెక్కలందు నా
ననమున దాల్చుపద్ధతి ఘనంబగు శోణితపాండురద్యుతుల్
దనరఁగ (విష్ణుమూర్తి)కి ముదంబున వాహనమైన పక్షిరా
జనువున శరషనంబులు ప్రియంబున మాకు నొసంగుగావుతన్.

4


చ.

నలినభవాండభాండభువనంబుల దుష్టుల శిక్ష సేయఁగా
గలుఁగు ప్రతాపరేఖ యన గాంచనవేత్రముఁ బూని జక్రి దా
పల వసియించువేలుపులు బారులు దిద్దెడు కంధిరాట్సుతుం
డలరఁగ నిట్టికావ్యము నయంబొదవ న్సమకూర్చు నెంతయున్.

5


ఉ.

చక్రము శంఖము న్గదయు శార్ఙ్గము ఖడ్గము నాదిగా ని
ర్వక్రపరాక్రమాయుధపరంపరలవ్ మణిభూషణంబులన్
(శక్ర)మణిప్రభోపమితశ్యామలకాంతియు వైజయంతియున్
సక్రమ మొప్ప నెల్లపుడు సన్నుతిఁ జేసెద నిష్టసిద్ధికిన్.

6