పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

అన నాలకించి యగచర
జనకర్త ల్గగనసరణి సకలాశలశృం
గనగాగ్రశాఖలన్ ధృతి
గనసాగిరి నిలిచి చిత్రగతి నయ్యెడలన్.

151


తే.

దృఢతరసహస్రకరసృష్టి తేజరిల్ల
జానకీజాని నీక్షించి చంద్రహాస
ధారి యాగ్రహశిఖశిఖల్ ధరణి నిండ
ఖేచరనిశాటతతి యాలకించ నాడె.

152


చ.

అనఘ! జగత్రయిం గలఁచియాడితి నా కెదిరించనేరలం
గనినదిలేదెకా! యయిన గాంచితి ని న్నతిసాహసక్రియా
ఖని, నికతేలకే నిలిచి కాలహరీంద్రకరాళసాయకా
సనశరలేఖలం గలన స్రగ్గఁగఁ జేసిన లెస్స యన్నిటన్.

153


క.

నాయెడ రాక్షససేనల్
నీయెడ నాదిత్యఘట లనిందితగణనల్
సేయఁగఁ జండతరాజిం
జేయఁగ హృత్కాంక్షలెల్ల సిద్ధించు గనన్.

154


వ.

అనిన యతనిగాథ లాలించి దరహసితాననస్థలియై దాశరథి యంగీకరించిన
దానికిఁ జంద్రహాసి యాగ్రహదృగ్జనితదహనకీలాకణచ్ఛట లెగయ నశని
సదృశాట్టహాసనాదక్రియల కజాండస్థలి కలసి చలించ కెల్లార్చి గద్దించి
నల్దిశల్ గలయ నిరీక్షించి.

155


సీ.

కాంచనస్యందనఖరచక్రహతిచేత
             శేషాహితలలెల్లఁ జితికిలంగ
సాయకాసనఘనజ్యాటంక్రియలచేత
             జలరాశి యెంతంత కలకసాగ
గాఢకేతనదండఘర్షణస్థితిచేత
             గగనతారాశ్రేణి కంధిరాల
కంఖాణనిశితరింఖాఘట్టనలచేత
             నచలారి నలినలియైచెలంగ