పుట:దశరథరాజనందనచరిత్ర (మరింగంటి సింగరాచార్య).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్రితముగా నున్న మరింగంటి కవుల రచనలలో నిది యొకటి.[1] ఈగ్రంథరచనాసమాప్తికాలము (1764) క్రీ. శ. 1839. ఆంగీరస సం॥ భాద్రపద శు. అష్టమీయని కవి తెల్పినాడు.

ఈ వెంకటనరసింహాచార్యులవి కొన్నిచాటుపద్యము లుండెనట. వానిలో రెండు మాత్రము మా తండ్రిగారి సంరక్షణలో నున్నవి. 'నల్లగొండ జిల్లా కవులు చాటువులు' (భారతి 1969 జూన్) అను వ్యాసమున వానిని ససందర్భముగా నుదహరించినాను.

7. చెన్నకృష్ణమాచార్యులు :- వెంకట నరసింహాచార్యుల సమకాలీనుడైన యీకవియు కనగల్లు వాస్తవ్యుడే యైనను కవిని గూర్చిన వివరములు తెలియుటలేదు. యాదగిరి నృసింహశతకము, మరికొన్ని రచనలు గలవట. అన్నియును అముద్రితములు. గో. క. సం. (399పు) యందును ఈ కవినిగూర్చిన విశేషవివరములు లేవు.

8. వరదదేశికులు:- గో.కం. సం. పేర్కొనబడని కవులలో నొకడైన యీ వరదదేశికులు షుమారు 150 సం. క్రిందివాడు. సరసకవి. సూర్యాపేట తాలూకాయందలి నరసింహాపుర మీతనినివాసస్థలము. శ్రీరామపాదుకాస్తవము[2], గోదాస్తుతి యను రెండు సంస్కృతరచన లీతనివి లభ్యమైనవి. రచన చాలా విలక్షణమైనది.

9. అప్పలదేశికులు:- శ్రీరామపాదుకాస్తవకర్తగా పేరుగాంచినవాడు. కాని యిది ఈయన రచనగారు. కర్తపేరులేని అర్వపల్లీనృసింహస్తోత్ర మొకటి[3] గలదు. దానిరచయిత అప్పలదేశికులవారే యని కొన్ని దృష్టాంతములతో ఈమధ్య తెలిసినది.

  1. తాలాంకనందినీపరిణయము- ఒక పరిశీలన (శ్రీ) (భారతి. 1967 డిసెంబర్).
  2. శ్రీరామపాదుకాస్తవము - మరింగంటి అప్పలదేశికులవారిపేర 1967 సెప్టెంబరు 'భారతి'యందు ప్రచురించినాను. కాని తరువాత లభించిన యాధారములవలన తత్కర్త వరదదేశికులవారని తెలిపిన మిత్రులు మరింగంటి పురుషోత్తమాచార్యులవారు. ‘గోదాస్తుతి'లోని కొన్ని శ్లోకములు వరంగల్లునందలి వైదికకళాశాల ప్రిన్స్ పాల్ శ్రీమాన్. న. చ. రఘునాథాచార్యులవారివద్ద గలవు.
  3. "అర్వపల్లీనృసింహస్తోత్రము" ఆంధ్రసాహిత్యపరిషత్ పత్రిక. (ప్లవంగ.లమార్గశీర్ష - పుష్య.) సంచిక (శ్రీ).