పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

viii

నేను రాజకోట చేరాను. అక్కడ యీ విషయాన్ని గురించి వివరాలు సేకరించాను. ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు ప్రారంభించాను. బగ్సరా మొదలుగా గల చోట్ల నేను ఉపన్యాసాలు యిచ్చాను వీరమ్ గ్రామ సమస్యా పరిష్కారానికి అవసరమైతే సత్యాగ్రహసమరానికి సిద్ధంగా వుండమని ప్రజల్ని హెచ్చరించాను. ప్రభుత్వ గూడచారి విభాగం వారు నా నోట వెడలిన యీ సమాచారం ప్రభుత్వానికి పంపించారు. ఆపంపిన పెద్ద మనిషి ఆగ్రామానికే కాక దేశానికే ఉపకారం చేశాడని చెప్పవచ్చు. చివరికి లార్డ్ ఛేమ్స్‌ఫర్డ్‌తో యీ విషయమై చర్చించాను. ఆయన తను యిచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. యితరులు కూడా యీ విషయమై ప్రయత్నించారని నాకు తెలుసు కాని సత్యాగ్రహ సమరం ప్రారంభమవుతుందని తెలిసిన తరువాతనే వీరమ్ గ్రామ్ సమస్య పరిష్కరించడం జరిగిందని నాకు తెలిసింది

వీరమ్ గ్రామ్ గొడవ ముగిసిన తరువాత గిర్మిట్ చట్టం (ఇండియన్ ఇమిగ్రేషన్ ఆక్టు) వ్యవహారం వచ్చింది. దీన్ని రద్దు చేయించుటకు ఎంతో కృషి జరిగింది. యీ విషయమై సామూహిక ఉద్యమం నడిచింది బొంబాయిలో జరిగిన పెద్ద సభలో గిర్మిట్‌ఆక్టును రద్దు చేయుటకు 1917 మే 31 తేదీ వరకు గడువు యివ్వడం జరిగింది. యీ తేదీని ఎందుకు నిర్ణయించారో ఆచరిత్ర యిక్కడ వ్రాయడం లేదు. అసలు గిర్మిట్ విధానాన్ని రద్దు చేయడం అవసరమని చెప్పుటకు వైస్రాయి దగ్గరకి, మొదటిసారిగా మహిళా ప్రతినిధి బృందం వెళ్లి విన్నవించింది యిందు ముఖ్యంగా కృషిచేసింది ఎవరో చెప్పడం అవసరం ఆమె పేరు చిరస్మరణీయురాలు సోదరి జాయీ జీపిటీట్ ఆమె ఎంతో కృషి చేశారు. ఆసంగ్రామంలో కేవలం సత్యాగ్రహం ప్రారంభిస్తామని అనగానే విజయం లభించింది. అయితే ప్రజా ఉద్యమం దీనికి అవసరమైందని చెప్పక తప్పదు వీరమ్ గ్రామ సమస్యకంటే గిర్మిట్ విధానం రద్దు ఎంతో ముఖ్యమైనది రౌలట్ ఆక్టు తరువాత లార్డ్ ఛేమ్స్ ఫర్డ్ అనేక తప్పులు చేశారు. అయినా ఆయన తెలివిగల చతురుడైన వైస్రాయి అని చెప్పడానికి సందేహించను సివిల్ సర్వీసులో పర్మినెంటుగా వుండే అధికారుల పంజానుంచి ఏవైస్రాయి కూడా తప్పించుకోలేడు