పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/382

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
363
సత్యాగ్రహ చరిత్ర

పైన తెలిపిన మా కోరికలకు మీరు తృప్తికరంగా సమాధానం పంపితే నేను మా దేశ ప్రజలకు సత్యాగ్రహాన్ని ఆపమని సలహా యిస్తాను."

నేను వ్రాసిన యీ జాబుకు జనరల్ స్మట్స్ అదేరోజున సమాధానం పంపించాడు. దాని సారం క్రింద తెలియజేస్తున్నాను

“మీరు కమీషన్ ఎదుట సాక్ష్యం యివ్వలేనందుకు ప్రభుత్వం చింతిస్తున్నది అయితే ప్రభుత్వం స్థితిని గ్రహించింది మీ స్వయం సేవకులపై జరిగిన దౌర్జన్యాలను రుజూ చేయు పనిని ఆపవలెనని చేసిన మీ నిర్ణయానికి వెనుక గల కారణాలను సైతం ప్రభుత్వం గ్రహించింది. సత్యాగ్రహులపై క్రూరంగా వ్యవహరించారనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా నిరాకరిస్తున్నది. అయితే మీరు కమీషన్ ఎదుట సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టక పోతే ప్రభుత్వం యీ విషయంలో ఏమీ చర్యగైకొనలేదని తెలియజేస్తున్నాను. సత్యాగ్రహుల్ని విడుదల చేయమని మీరు కోరక ముందే అందుకు సంబంధించిన ఆర్డరు ప్రభుత్వం పంపించి వేసింది. భారత జాతికి కలిగిన దుఃఖాలను గురించి మీ జాబులో చివర వ్రాశారు. ఆ విషయంలో కమీషన్ రిపోర్టు అందేంత వరకు ఏ చర్య ప్రభుత్వం తీసుకోదని తెలియజేస్తున్నాను.

మా యీ రెండు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగక పూర్వం నేను, శ్రీ అండ్రూస్ చాలాసార్లు జనరల్ స్మట్సును కలిసి మాట్లాడాము. సర్ బెంజిమన్ రాబర్ట్‌సన్ కూడా ప్రిటోరియా చేరారు. సర్ బెంజిమన్ ప్రజలకు యిష్టుడైన అధికారిగా పేరు పొందిన వ్యక్తి గోఖలే గారి దగ్గరి నుంచి సిఫారసు పత్రం కూడా తన వెంట తీసుకు వచ్చారు. కాని సామాన్య ఆంగ్లాధికారుల్లో వుండే బలహీనతలనుంచి ఆయన విముక్తుడు కాలేదని నాకు బోధపడింది. ఆయన రాగానే భారత జాతి ప్రజల్లో తగాదాలు సృష్టించడానికి, సత్యాగ్రహుల్ని భయ పెట్టడానికి పూనుకున్నాడు. ప్రిటోరియాలో మొదటి సారి ఆయనను కలిసినప్పుడు నాపై మంచి ప్రభావం పడలేదు. సత్యాగ్రహుల్ని భయపెడుతున్నాడని నాకు కొన్ని టెలిగ్రాములు అందాయి. వాటిని గురించి సర్ బెంజిమన్‌తో నేను చర్చించాను ఆందరితోను స్పష్టంగాను, నిజాయితీగాను వ్యవహరించడం నా ధర్మం తద్వారా మేమిద్దరం స్నేహితులమైనాము